logo

ఏఐజీ ఆసుపత్రిలో అత్యాధునిక రెండో పెట్‌ స్కాన్‌

దక్షిణాసియాలోనే రెండు పెట్‌ స్కాన్‌ యంత్రాలను కలిగిన మొదటి ప్రైవేటు ఆసుపత్రిగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రి నిలిచింది.

Published : 25 Jan 2023 01:46 IST

పెట్‌ స్కాన్‌ ప్రారంభోత్సవంలో వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి రిజ్వీ,

ఏఐజీ ఛైర్మన్‌ డి.నాగేశ్వరరెడ్డి, డాక్టర్‌ సునీత

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణాసియాలోనే రెండు పెట్‌ స్కాన్‌ యంత్రాలను కలిగిన మొదటి ప్రైవేటు ఆసుపత్రిగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రి నిలిచింది. క్యాన్సర్‌ చికిత్సలో ఉపకరించే పెట్‌ స్కాన్‌ యంత్రం ఒకటి గచ్చిబౌలిలోని ఏఐజీలో ఇప్పటికే ఉండగా, మరింత అత్యాధునిక పరీక్షల కోసం రెండోదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీ బుధవారం ఈ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ‘‘అధునాతన పెట్‌ స్కాన్‌ యంత్రానికి కొద్ది నెలల్లో రోబోటిక్‌ ఆర్మ్‌ జోడిస్తాం. దీంతో స్కానింగ్‌ సమయంలో అనుమానం ఉంటే అప్పటికప్పుడు బయాప్సీ చేయడానికి వీలవుతుంది. కచ్చితమైన లక్ష్యంతో క్యాన్సర్‌ను గుర్తించడానికి సహాయ పడటమే కాకుండా ఇతర సంక్షిష్టతలను నివారిస్తుంది. అన్ని రకాల గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ క్యాన్సర్‌ చికిత్సకు దేశంలోనే ఏఐజీ ఆసుపత్రి కేంద్రంగా మారింది. వైద్యపరంగా గ్యాస్ట్రో కేర్‌లో నైపుణ్యం, నిర్వహణ, శస్త్రచికిత్సలు, మల్టీడిసిప్లినరీ విధానం అందుబాటులో ఉండటంతో రోగుల సంఖ్య పెరుగుతోంది. నిర్ధారణ దగ్గర్నుంచి చికిత్స వరకు ఆసుపత్రి ఆవరణలోనే అందేలా చూసుకోవడం మా బాధ్యత. రెండో పెట్‌ స్కాన్‌తో తక్షణ పరీక్షలతో రోగుల సమయం ఆదా అవుతుంది’’ అన్నారు. అంకాలజీ పరీక్షలే కాకుండా న్యూరాలజీ, గుండె పరిస్థితులు, చిన్న గాయాలను సైతం గుర్తించేందుకు పెట్‌ స్కాన్‌లోని సాంకేతికత దోహదం చేస్తుందని ఏఐజీ ఆసుపత్రుల న్యూక్లియర్‌ మెడిసిన్‌ విభాగాధిపతి, సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ బి.సునీత అన్నారు. మెరుగైన చిత్ర నాణ్యత, కచ్చితమైన వ్యాధి దశ గుర్తింపుతో మెరుగైన చికిత్స అందించేందుకు దోహదం చేస్తుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని