పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు: మంత్రి సబిత
రాష్ట్రంలో 10వేల మంది ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అక్రమాలకు తావులేకుండా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.
ఎల్లమ్మ ఆలయం వద్ద కుటుంబ సభ్యులతో మంత్రి సబిత
తాండూరు గ్రామీణ: రాష్ట్రంలో 10వేల మంది ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అక్రమాలకు తావులేకుండా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మండలంలోని మంత్రి స్వగ్రామం కోటబాస్పల్లి మంగళవారం జరిగిన ఎల్లమ్మ తల్లి పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు.
బండి సంజయ్‌కి తగదు..: భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. ఆయన కుమారుడు ర్యాగింగ్‌కు పాల్పడటంతో చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తే ముఖ్యమంత్రి కేసు పెట్టించారని ఆరోపించడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. భార్యా భర్తల బదిలీల విషయంలోనూ రాజకీయ ఆరోపణలు చేయడం తగదన్నారు.
* వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచే పోటీ చేస్తానని, వికారాబాద్ జిల్లాలో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తాండూరు నియోజకవర్గంలో వర్గపోరును వారే దిద్దుకుంటారంటూనే, తమ మధ్య ఎలాంటి వర్గపోరు లేదని అందరం ఒకే పార్టీలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. సిటీ కేబుల్ ఎండీ నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ లక్ష్మారెడ్డి, భారాస పట్టణ, మండలాధ్యక్షులు అప్పూ, రాందాస్ ఉన్నారు.
సంతోషం కంటే బాధే ఎక్కువ
తన సొంతూరు కోటబాస్పల్లికి వస్తే సంతోషం కంటే బాధే ఎక్కువగా ఉంటుందని మంత్రి సబితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్వగ్రామానికి వస్తే తల్లిదండ్రులు గొట్టిగ మహిపాల్‌రెడ్డి, వెంకటమ్మలు గుర్తుకొస్తారని, వారు లేనందున తరచూ రాలేకపోతున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఎల్లమ్మ ఆలయానికి చేరుకొన్న మంత్రి తన సోదరుడు, సిటీ కేబుల్ ఎండీ నర్సింహారెడ్డి, సుశ్మితా రెడ్డిలతోపాటు కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు చేశారు.
* ఆమెను పీఆర్‌టీయూ జిల్లా, మండల ప్రతినిధులు నాగప్ప, నర్సిరెడ్డి, కిష్టప్ప, వెంకట్‌రాంరెడ్డి, శశిధర్, శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, మల్‌రెడ్డి తదితరులు కలిసి బదిలీలపై కృతజ్ఞతలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.