logo

మామిడిపై ఆశ.. తప్పదా నిరాశ..!

వాతావరణ పరిస్థితులు అన్నదాతలతో దోబూచులాడుతున్నాయి. మామిడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల కలలు కల్లలుగానే మారుతున్నాయి.

Published : 25 Jan 2023 01:46 IST

ప్రకృతి ప్రకోపం.. అరకొరగా పూత
న్యూస్‌టుడే, పరిగి, పూడూరు, వికారాబాద్‌ గ్రామీణ  

వాతావరణ పరిస్థితులు అన్నదాతలతో దోబూచులాడుతున్నాయి. మామిడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల కలలు కల్లలుగానే మారుతున్నాయి. సాధారణంగా డిసెంబరు నుంచి జనవరి నెలాఖరు నాటికి మామిడి పూత వస్తుంది. చలిగాలులు ఉన్నప్పటికీ ఈసారి పూత కనిపించడం లేదు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మామిడి దిగుబడులు అంతంత మాత్రంగానే ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పెట్టుబడులు కూడా రావేమో..

తాండూరు, పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో 13,099 ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ఇంకా అనేక మండలాల్లో కొత్త తోటలు ఏర్పాటవుతున్నాయి. దీంతో క్రమేపి పండ్ల తోటల విస్తీర్ణం పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే మామిడికి సగానికి సగం కూడా పూత ఆశాజనకంగా లేదని పెంపకం దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కనీసం పెట్టుబడులు కూడా వస్తాయా లేదోనని ఆందోళన చెందుతున్నారు.  

పదేళ్లకు పైబడిన చెట్లు కూడా కొత్తగా ఇగురు వేస్తున్నాయి. దీంతో ఎటు చేసినా కొత్త ఆకులతో పచ్చదనంతో కనిపిస్తున్నాయి. వేల రూపాయలతో పూత మందులు కొనుగోలు చేసి పిచికారీ చేస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు.  దోమ, పరిగి, దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట, కుల్కచర్ల, చౌడాపూర్‌ మండలాల్లో ఇదే విధంగా కనిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రధానంగా బంగినపల్లి, మల్లిక, తోతాపురి, తదితర రకాలు సాగులో ఉన్నాయి. అధిక  మంచుతోనూ బూడిద తెగులు, తేనెమంచు ఆశించి నష్టం వాటిల్లింది.


సగానికి సగం తగ్గింది

ఉమర్‌, రైతు, మన్నెగూడ

ఎకరన్నర విస్తీర్ణంలో మామిడికి ఈసారి సగానికి సగం పూత తగ్గింది. కొన్ని చెట్లు చిగురించగా మరికొంత బూడిద తెగులుతో నష్టపోవాల్సి వచ్చింది. ఏడాది కాలంగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చినా ఆశలు నీరుగారాయి. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం బీమా సదుపాయం కల్పించాలి.


వాతావరణ పరిస్థితులే కారణం

చక్రపాణి, జిల్లా ఉద్యానాధికారి

మామిడి పూత పట్టకపోవడానికి వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణం. కొంతమంది రైతులు తెలియక వేసవిలో చెట్లకు నీటి తడులను అందిస్తుంటారు. ఇది కూడా ఒక రకంగా కారణమవుతుంది. వర్షాలు అధికంగా కురియడంతోనే చెట్లు కొత్తగా చిగురించాయి. ఇలాంటి వాటికి మందులు పిచికారీ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు