logo

దేవుడి మాన్యం.. కబ్జాదారుల వశం

జిల్లాలో దశాబ్దాలుగా ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడింది.

Published : 26 Jan 2023 00:49 IST

ఆదాయం లేక పూజలకూ ఇక్కట్లు

న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పూడూరు, కుల్కచర్ల గ్రామీణ, వికారాబాద్‌, తాండూరు: జిల్లాలో దశాబ్దాలుగా ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో కోట్లాది రూపాయల విలువైన భూములు ఉన్నా ఆదాయం లేక దేవుడికి ధూప దీప నైవేద్యాలూ కొరవడుతున్నాయి. ఎక్కడైనా విషయం బయటకు వస్తే నామమాత్రపు చర్యలతో అధికారులు సరిపెడుతున్నారని విమర్శలొస్తున్నాయి.  


సంజీవ స్వామిని పట్టించుకునేదెవరు

దోమ మండలం ఎన్కేపల్లిలోని శ్రీసంజీవస్వామి ఆలయానికి 104 ఎకరాలు ఉంది. కేవలం 45 ఎకరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు మిగతా వాటి జోలికి వెళ్లడం లేదు. దేవుడి పేరిట బ్యాంకులో రూ.9లక్షలు మూలుగుతున్నాయి. చివరకు నిత్య పూజలు కూడా లేకుండా పోయాయి.


రామలింగేశ్వరుడి హద్దులు ఎలా..

పూడూరులోని దామగుండం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన అటవీ- రెవెన్యూశాఖ అధికారుల మధ్య సమన్వయం లేక ఏళ్లు కావస్తున్నా భూములకు హద్దులు తేల్చలేక పోతున్నారు. ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో ఉండగా సుమారు 33 ఎకరాల వరకు ఆలయ భూములు రికార్డుల్లో ఉన్నాయి. గత డిసెంబరులో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఫారెస్టు శాఖకు నోటీసులు ఇచ్చి సర్వే చేసేందుకు రాగా ఫారెస్టు సిబ్బంది అడ్డుకుని సర్వే జరగకుండా చేశారు. ఆలయం ప్రదేశం కలిపి ఐదెకరాలే ఉందని ఫారెస్టు అధికారుల వాదన.  


పాంబండ కింద 100కు 30 ఎకరాలే మిగులు

కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల పాంబండ శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయానికి సుమారు 100 ఎకరాల భూమి ఉన్నా ఆధీనంలో మాత్రం 30.18 ఎకరాలు మాత్రమే ఉంది. ఇందులో కేవలం 10.18 గుంటల భూమి ద్వారా ఆలయానికి  ఆదాయం వస్తోంది. ఇకనైనా అధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేపట్టి అక్రమార్కుల కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించాలని భక్తులు కోరుతున్నారు.  


అనంతుని లెక్క తేలడంలేదు..

అనంతగిరి అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించిన భూములు జిల్లాలో 170 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. తాండూర్‌, ధారూర్‌, నవాబ్‌పేట వికారాబాద్‌ మండలాల్లో ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయో నేటికీ లెక్క తేలలేదు. ఇటీవల ఆలంపల్లి, గుడుపల్లిలో స్వామి ఆలయ భూములను ఆక్రమించటానికి కొందరు యత్నించారు. ఆలయ ధర్మకర్త, అధికారులు స్థలాన్ని పరిశీలించి పనులను నిలిపివేశారు. గుడుపల్లిలో రోడ్డు వేయటానికి యత్నించారు. ఆలంపల్లిలో కూడా భూములను చదును చేశారు. ఇది తెలుసుకున్న అధికారులు పనులను నిలిపివేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని