logo

దివ్యాంగన్‌..

దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడేవారు సైనికులు. అటువంటివారు విధి నిర్వహణలో అవయవాలు కోల్పోతే అలానే వదిలేయకుండా ఆత్మస్థైర్యాన్ని నింపుతూ మరో జీవితాన్ని అందిస్తోంది నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ దివ్యాంగ్‌ ఎంపవర్‌మెంట్‌ కేంద్రం.

Updated : 26 Jan 2023 05:24 IST

సీఆర్‌పీఎఫ్‌ ఎన్‌సీడీఈ పునరుజ్జీవం
అవయవలోపం ఉన్నా అద్భుతాలు సృష్టిస్తున్న జవాన్లు

దివ్యాంగ జవాను ప్రదర్శిస్తున్న విలువిద్యను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (పాత చిత్రం)

దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడేవారు సైనికులు. అటువంటివారు విధి నిర్వహణలో అవయవాలు కోల్పోతే అలానే వదిలేయకుండా ఆత్మస్థైర్యాన్ని నింపుతూ మరో జీవితాన్ని అందిస్తోంది నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ దివ్యాంగ్‌ ఎంపవర్‌మెంట్‌ కేంద్రం. సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) పర్యవేక్షణలో ఈ కేంద్రం నడుస్తోంది. అప్పటి సీఆర్‌పీఎఫ్‌ డీజీ ఏపీ.మహేశ్వరి జవహర్‌నగర్‌ పంచాయతీ పరిధిలోని రంగారెడ్డి గ్రూప్‌ సెంటర్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి చేతుల మీదుగా 2020లోఅంకురార్పణ  జరిగింది.

న్యూస్‌టుడే, శామీర్‌పేట


108 మంది జీవితాల్లో వెలుగులు

దివ్యాంగ్‌ జవాన్లలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి.. తిరిగి వారి సేవలను వివిధ రకాలుగా ఉపయోగించుకుంటోంది. రెండేళ్లలో ఐదు బ్యాచ్‌లు నిర్వహించి 108 మంది దివ్యాంగ జవాన్లకు క్రీడలు, కంప్యూటర్‌ విభాగాల్లో తర్ఫీదునిచ్చారు.
* పారా స్పోర్ట్స్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో పాటు వృత్తి పరమైన అంశాలపై ట్రిపుల్‌ ఐటీ, బిట్స్‌ పిలానీ లాంటి సంస్థల అధ్యాపకులు, నిపుణులతో ప్రత్యేక శిక్షణనిప్పిస్తున్నారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో వారు తమ సత్తా చాటి బంగారు పతకాలను సీఆర్‌పీఎఫ్‌ ఖాతాలో వేస్తున్నారు. కాళ్లు లేకపోయినా కృత్రిమ కాళ్లతో పరుగులు తీయడం, కంప్యూటర్‌ రంగాల్లో రాణిస్తున్నారు.


భరోసా కల్పిస్తూ..

మహేశ్‌చంద్ర లడ్డా, ఛైర్మన్‌, దివ్యాంగ్‌ ఎంపవర్‌మెంట్‌ కేంద్రం

దివ్యాంగులమనే ఆలోచన కలగకుండా వారిలో ఆత్మ విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాం. దివ్యాంగ్‌ వారియర్స్‌ పారా క్రీడల్లో జాతీయ స్థాయి పతకాలను సాధిస్తున్నారు. క్యాంపు కార్యాలయాల్లో కంప్యూటర్‌ రంగంలో వారి సేవలను వినియోగించుకుంటున్నాం. దివ్యాంగులకు ఈకేంద్రం భరోసానిస్తోంది.


యోధులుగా మారుతున్నారు:

అనిల్‌ మింజు, డీఐజీ, సీఆర్‌పీఎఫ్‌ రంగారెడ్డి క్యాంపస్‌

పోరాటంలో దివ్యాంగులుగా మారిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను వదిలేయకుండా రంగారెడ్డి క్యాంపస్‌లో ప్రత్యేక శిక్షణనిచ్చి కొత్త జీవితాన్ని అందిస్తున్నాం. యోధులుగా మార్చేందుకు దేశంలోని పేరున్న విద్యా సంస్థలతో శిక్షణ ఇచ్చి శారీరకంగా, మానసికంగా ప్రోత్సహిస్తున్నాం.


నక్సలైట్‌ ఆపరేషన్‌లో రెండు కాళ్లు కోల్పోయా

కోడేగిరి లక్ష్మణ్‌రావు

మాది కామారెడ్డి జిల్లా. 2013 జూన్‌లో సీఆర్‌పీఎఫ్‌ దళంలో చేరా. 2018 మార్చి 30న నక్సల్స్‌ ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ల్యాండ్‌ మైన్‌పై కాలుపడి రెండు కాళ్లు కోల్పోయా. వైద్య సేవలు పొందిన తర్వాత కృత్రిమ కాళ్లు అమర్చారు. ప్రత్యేక శిక్షణతో ప్రస్తుతం చాంద్రాయణగుట్టలోని సీఆర్పీఎఫ్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని