logo

విధుల్లో ఉత్తములు.. సేవలకు పతకాలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన ‘ఉత్తమ సేవా’ పతకాలకు నగరం నుంచి ముగ్గురు అధికారులు ఎంపికయ్యారు.

Updated : 26 Jan 2023 05:25 IST

మూడు  కమిషనరేట్లలో ముగ్గురు పోలీసు అధికారులకు గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన ‘ఉత్తమ సేవా’ పతకాలకు నగరం నుంచి ముగ్గురు అధికారులు ఎంపికయ్యారు. మూడు కమిషనరేట్ల నుంచి ఒక్కొక్కరికి ఈ పతకాలు దక్కడం విశేషం. హైదరాబాద్‌ నగర సంయుక్త కమిషనర్‌ పెర్ల విశ్వప్రసాద్‌, సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ గంగసాని శ్రీధర్‌, రాచకొండ ఐటీ సెల్‌ ఇన్‌ఛార్జి మామిళ్ల శ్రీధర్‌రెడ్డి ఎంపికయ్యారు. వృత్తిలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు కేంద్ర హోం శాఖ ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తోంది.


పి.విశ్వప్రసాద్‌

హైదరాబాద్‌ సంయుక్త కమిషనర్‌ (స్పెషల్‌ బ్రాంచ్‌)

ప్రస్తుతం హైదరాబాద్‌ సంయుక్త కమిషనర్‌(స్పెషల్‌ బ్రాంచ్‌) బాధ్యతల్లో ఉన్న విశ్వప్రసాద్‌కు మెట్రో పోలీసింగ్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఎల్బీనగర్‌, మాదాపూర్‌, సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా పనిచేశారు. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. స్పెషల్‌ బ్రాంచ్‌ సంయుక్త కమిషనర్‌గా అసాంఘిక శక్తులు, ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. పలు రివార్డులు అందుకున్నారు.


గంగసాని శ్రీధర్‌

ఏసీపీ. సైబరాబాద్‌ సైబర్‌ క్రైం

ఎస్సైగా 1991లో బాధ్యతలు చేపట్టిన శ్రీధర్‌ 1993లో నగరంలో వరుస బాంబు పేలుళ్లకు కుట్రపన్నిన ఇఖ్వాన్‌ ఉల్‌ ముస్లిమీన్‌(ఐయూఎం)కు చెందిన నిసార్‌ అహ్మద్‌ భట్‌, గౌర్‌ అమీన్‌మీర్‌ను అదుపులోకి తీసుకున్న సిట్‌లో కీలకంగా వ్యవహరించారు. 2007లో కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌లో పనిచేసినప్పుడు ఖమ్మం, జహీరాబాద్‌లో ఉగ్రవాదుల అరెస్టు, తీవ్రవాదులకు శిక్షణనిచ్చిన సత్తార్‌ను అదుపులోకి తీసుకోవడంలో కీలకపాత్ర పోషించారు. 177 రివార్డులు దక్కాయి.


మామిళ్ల శ్రీధర్‌రెడ్డి

ఐటీ సెల్‌ ఇన్‌ఛార్జి, రాచకొండ

ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి 1998 బ్యాచ్‌ ఎస్సై. నల్గొండ జిల్లాలో ఎక్కువ కాలం పనిచేశారు. సంచలనం సృష్టించిన హాజీపూర్‌ కేసులో సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. 2018 నుంచి ఐటీ విభాగం ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. 2009లో సేవా పతకం, 2015లో రాష్ట్ర శౌర్య పతకం, 2019లో ముఖ్యమంత్రి సర్వోన్నత పతకం అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని