logo

గణతంత్ర దినోత్సవాలకు.. బిస్కెట్లు, చాక్లెట్లకు పంతుళ్ల వంతులు

గణతంత్ర దినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంతుళ్లే బిస్కెట్లు, చాక్లెట్లు తెస్తున్నారు.

Updated : 26 Jan 2023 05:39 IST

ప్రభుత్వ  పాఠశాలలకు అరకొరగా నిర్వహణ బడ్జెట్‌

ఈనాడు,హైదరాబాద్‌, న్యూస్‌టుడే, అమీర్‌పేట, చంచల్‌గూడ, మెహిదీపట్నం: గణతంత్ర దినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంతుళ్లే బిస్కెట్లు, చాక్లెట్లు తెస్తున్నారు. కరోనా తర్వాత ప్రభుత్వం పాఠశాలలకు బడ్జెట్‌ను అరకొరగా ఇస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే జాతీయ పండగలు గణతంత్ర దినోత్సవం.. పంద్రాగస్టుకు విద్యార్థులందరికీ బిస్కెట్లు.. చాక్లెట్లు పంపిణీ చేసేందుకు వీలుగా కొన్నేళ్ల నుంచి సర్కారు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. కరోనా ప్రభావంతో ప్రత్యేక నిధులను తీసేసింది. నిర్వహణ ఖర్చులకు మాత్రం జిల్లా విద్యాశాఖ  అధికారులకు పంపుతోంది. గతేడాది నిర్వహణ ఖర్చులు కూడా పంపకపోవడంతో పంద్రాగస్టుకు హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కుని పిల్లలకు పంపిణీ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడుజిల్లాల్లోని ప్రభుత్వపాఠశాలల్లో గురువారం వేడుకలు నిర్వహించనున్నారు. వీటిలో కొన్ని పాఠశాలలకు మాత్రమే బుధవారం సాయంత్రానికి బిస్కెట్లు, చాక్లెట్లను అధికారులు పంపించారు. మిగిలిన ప్రాంతాల్లో కొందరు ఉపాధ్యాయులే గురువారం ఉదయం తీసుకెళ్లనున్నారు. ‘విద్యార్థులంటే మా పిల్లలే కదా... డబ్బు వచ్చినా.. రాకపోయినా తీసుకెళ్తాం’అని కొందరు ఉపాధ్యాయులు ‘ఈనాడు’తో అన్నారు.  


పంద్రాగస్టుకూ లేదు..

ఆజాదీకా అమృతోత్సవ్‌ వేడుకల్లో భాగంగా పంద్రాగస్టును పాఠశాలల్లో ఘనంగా నిర్వహించాలంటూ విద్యాశాఖ ఉన్నతాధికారులు హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఘనంగా కార్యక్రమాలు నిర్వహించి, చాక్లెట్లు, బిస్కెట్లు విద్యార్థులకు పంచిపెట్టారు. వీటికి సంబంధించిన ఖర్చు మాత్రం సర్కారు నుంచి ఇప్పటి వరకూ రాలేదు.


ప్రైవేటు సంస్థల సహకారం

ఉపాధ్యాయులతోపాటు కొన్నిచోట్ల శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఐటీ కంపెనీలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు వచ్చి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటికయ్యే ఖర్చును ఆయా కంపెనీలు, సంస్థలు భరిస్తున్నాయి. గతంలో జాతీయ పండగలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకంగా నిర్వహించేవారు. కొత్త జాతీయ పతాకాలను తీసుకువచ్చి, పాఠశాలల ప్రాంగణాలను అందంగా తీర్చిదిద్దేవారు. ప్రభుత్వం నుంచి కేటాయింపులు తగ్గిపోవడంతో ఉన్నంతలోనే ఉపాధ్యాయులు, హెడ్‌మాస్టర్లు తలోచేయి వేసుకుని వేడుకలు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని