logo

బలమైన ఉద్యమంతోనే పంచాయతీ వ్యవస్థ పరిరక్షణ

బలమైన ఉద్యమంతోనే గ్రామ పంచాయతీ వ్యవస్థను కాపాడుకోగలమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు.

Updated : 26 Jan 2023 06:42 IST

సమావేశంలో ప్రసంగిస్తున్న సర్పంచుల సంఘం జాతీయ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, చిత్రంలో టీజేఎస్‌ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, ఇతర నేతలు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: బలమైన ఉద్యమంతోనే గ్రామ పంచాయతీ వ్యవస్థను కాపాడుకోగలమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. ఆ దిశగా సర్పంచులు పోరాటానికి సిద్ధం కావాలని ఆయన సూచించారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం సవరణపై తెలంగాణ సర్పంచుల సంఘం, తెలంగాణ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఆధ్వర్యంలో బుధవారం లక్డీకాపూల్‌లోని వెంకటేశ్వర అబోడ్‌ హోటల్‌లో అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటైంది. ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ ప్రజలకు మేలు జరుగుతుందని భావించి ఏర్పాటుచేసిన పంచాయతీ వ్యవస్థలో.. అంతిమంగా చట్టం తయారు చేయడం నుంచి సర్పంచి ఎలా పని చేయాలి, ఏం పని చేయాలి, చేయకుంటే తొలగించే అధికారమూ ఎమ్మెల్యేలకు ఇచ్చారని, పగ్గాలు వారి చేతుల్లో పెట్టుకుని సర్పంచులను పరుగెత్తమంటున్నారని విమర్శించారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేకే కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
* సర్పంచుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఎలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ తెలంగాణలో పంచాయతీరాజ్‌ కాకుండా ఎమ్మెల్యే రాజ్‌ కనిపిస్తోందన్నారు. * భాజపా నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం గ్రామ పంచాయతీలకు డబ్బులు వేస్తే సీఎం దొంగతనం చేశారన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, సీపీఐ కార్యదర్శి సాంబశివరావు, ఆప్‌ నేత డా.సుధాకర్‌, బీఎస్పీ నేత విజయానంద్‌,  సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నేత ఝాన్సీ, సీపీఎం నేత సారం మల్లారెడ్డి, అంబేడ్కర్‌ వాది జేబీ రాజు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు విమలక్క, వైతెపా నేత గట్టు రాంచందర్‌రావు, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ గౌరవ అధ్యక్షుడు పుసునూరి రవీంద్ర, సిద్ధార్థ, ఉపాధ్యక్షుడు అశోక్‌రావు, ఎంపీపీల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీశైలం తదితరులు మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని