logo

ఠాణాకు కూతవేటు దూరంలో వరుస చోరీలు

ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో 7 భవనాల్లోని 12 ఇళ్ల, కార్యాలయాల తాళాలను పగులగొట్టిన ఇద్దరు దొంగలు..

Published : 26 Jan 2023 04:23 IST

నాగోలు: ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో 7 భవనాల్లోని 12 ఇళ్ల, కార్యాలయాల తాళాలను పగులగొట్టిన ఇద్దరు దొంగలు.. రెండిళ్లలో 8 తులాల బంగారం, 20 తులాల వెండి, 2 ల్యాప్‌టాప్‌లను, చరవాణులను దోచుకెళ్లారు. మంగళవారం రాత్రి 1.30 నుంచి బుధవారం తెల్లవారుజాము 4.30 గంటల వరకు వరుస చోరీలకు ప్రయత్నించారు. తాళం వేసి ఉన్న ఇల్లు కనపడితే చోరీకి యత్నించారు. ఇవన్నీ ఎల్బీనగర్‌ ఠాణాకు కూతవేటు దూరంలో జరగడం గమనార్హం. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... చంద్రపురికాలనీలో నివసించే మధురిమ కుటుంబసభ్యులు చెన్నై వెళ్లారు. ఆ ఇంటి తాళం విరగ్గొట్టి అల్మరాలోని 4 తులాల బంగారం, 10 తులాల వెండి తీసుకెళ్లారు.
రహస్య లాకర్‌లో సొత్తు సేఫ్‌...  అల్మరాలోని రహస్య లాకరు తెరిచి చూడగా 12తులాల బంగారం నిక్షేపంగా ఉంది. ఇదే కాలనీలోని రోడ్డునం.5లో నివసించే వైద్య పరికరాల వ్యాపారి పర్వతం పవన్‌కుమార్‌ ఇంటి తాళాన్నీ విరగ్గొట్టిన దుండగులు 4 తులాల బంగారం, ఓ ల్యాప్‌టాప్‌ చోరీ చేశారు. సమీపంలోని మరో ఇంటివాసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రవితేజ విధులకు వెళ్లగా.. ఇంట్లోని లెనోవా ల్యాప్‌టాప్‌, 2 సెల్‌ఫోన్లను తీసుకెళ్లారు. 1.30కు సూర్యోదయనగర్‌లోని నర్సిరెడ్డి ఇంటి తాళం పగులగొట్టిన దుండగులు, ఆపై సమీపంలోని షావుకారు ఇంట్లోకి చొరబడ్డారు. తర్వాత చంద్రపురికాలనీ రోడ్‌నం.2ఏలోని సాయిరెసిడెన్సీ, ఆపై మధురిమ, రాజేష్‌రెడ్డిల ఇళ్లు, అడ్వకేట్‌ రంజిత్‌రెడ్డి కార్యాలయంలో చోరీకి ప్రయత్నించినా కొన్నిచోట్ల వారికి ఏమీ దొరకలేదు. విజయవాడ జాతీయ రహదారికి అతి సమీపంలో ఉండే ఈ వీధిలోని ఇళ్లలో అనేక కార్యాలయాలు ఉన్నారు. తాళంవేసి ఉన్న వాటిలో దుండగులు చోరీకి యత్నించారు. పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని