logo

తారు వేయరు.. తిప్పలు పట్టించుకోరు

యాలాల మండలంలో పీడబ్ల్యూ రోడ్డు చెన్నారం నుంచి పగిడిపల్లి, కొడంగల్‌ మండలం నాగారం వరకు 5.17 కిలో మీటర్ల మేర ఉంటుంది.

Published : 27 Jan 2023 01:40 IST

అసంపూర్తిగా పగిడిపల్లి, నాగారం రోడ్డు

న్యూస్‌టుడే, యాలాల: యాలాల మండలంలో పీడబ్ల్యూ రోడ్డు చెన్నారం నుంచి పగిడిపల్లి, కొడంగల్‌ మండలం నాగారం వరకు 5.17 కిలో మీటర్ల మేర ఉంటుంది. రోడ్డుతో పాటు 11 కల్వర్టులకు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద రూ.2.68కోట్ల నిధులను మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వం మంజూరు చేసింది. గుత్తేదారు టెండర్‌ దక్కించుకుని సంవత్సరం క్రితం పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా పగిడిపల్లి నుంచి నాగారం గ్రామ శివారు వరకు ఎనిమిది నెలల క్రితం కంకర పరిచి తరువాత వదిలేశారు. దీంతో వాహనదారులకు అవస్థలు తప్పడంలేదు.  

వాహనదారులు గాయాల పాలు

కొడంగల్‌ మండలంలోని అంగడిరైచూర్‌, నాగారం, రుద్రారం ప్రజలు యాలాల మండలంలోని పగిడిపల్లి, అక్కంపల్లి, చెన్నారం మీదుగా తాండూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. తారు వేయక పోవడంతో ప్రయాణికులు, వాహనదారులు నానా పాట్లు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు రోడ్డుదిగి కిందికి పోతున్నాయి. చోదకులు జారిపడి గాయాల పాలవుతున్నారు. జుంటిపల్లి ప్రాజెక్టు కుడి కాలువ దగ్గర మలుపు ఉండి కల్వర్టు నిర్మించక పోవడంతో ప్రయాణికులు అదుపుతప్పి కాలువలో పడే ప్రమాదం పొంచి ఉంది. రాత్రి సమయంలో ఆ రోడ్డుపై వెళ్లాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. వెంటనే తారు రోడ్డు నిర్మించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.


అధికారులు వెంటనే స్పందించాలి
- వరలక్ష్మి, సర్పంచి, పగిడిపల్లి

మా గ్రామానికి రోడ్డు వేస్తున్నారంటే ఎంతో సంతోషించాం. తారు వేయక అసంపూర్తిగా వదిలేయడంతో కష్టాలు తప్పడంలేదు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు పూర్తి చేసేలా గుత్తేదారును ఆదేశించాలి.  


ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం
- కరుణాకర్‌ చారీ, పంచాయతీరాజ్‌ డీఈఈ, తాండూరు  

చెన్నారం, పగిడిపల్లి, నాగారం వరకు తారు వేయాల్సిన పనులు నిలిచిన మాట వాస్తవమే. నిధులు ఉన్నాయి. పదిహేను రోజుల్లో పనులు ప్రారంభించాలని గుత్తేదారును ఆదేశించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని