logo

ఇక నెలలోపే.. వితంతువులకు ఆసరా

‘ఆసరా’ పింఛను పొందుతున్న భర్త మరణిస్తే.. పింఛను పొందాలంటే భార్య దరఖాస్తు చేయాల్సి వచ్చేది. అన్నీ పరిశీలించి ఏ ఆరు నెలలకో, సంవత్సరానికో ఆమెకు ఆసరా మంజూరు చేసేవారు.

Published : 27 Jan 2023 01:40 IST

న్యూస్‌టుడే, కొడంగల్‌ గ్రామీణం, బొంరాస్‌పేట

‘ఆసరా’ పింఛను పొందుతున్న భర్త మరణిస్తే.. పింఛను పొందాలంటే భార్య దరఖాస్తు చేయాల్సి వచ్చేది. అన్నీ పరిశీలించి ఏ ఆరు నెలలకో, సంవత్సరానికో ఆమెకు ఆసరా మంజూరు చేసేవారు. దీనివల్ల వితంతువులు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవారు. ఇకమీదట ఆ కష్టాలు పడాల్సిన అవసరంలేదు. నెలలోగా భర్త స్థానంలో భార్య (వితంతువు)కు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు అర్హులకు గుర్తించి దరఖాస్తులు చేయించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పస్తుతం పంచాయతీ కార్యదర్శులే అర్హులను గుర్తిస్తూ దరఖాస్తులు తీసుకొని మండల పరిషత్‌ కార్యాలయాల్లో అందిస్తున్నారు. ప్రక్రియను పూర్తి చేస్తూ 15 రోజుల్లోనే మంజూరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి పింఛన్లు ఇన్నాళ్లు ఆగిపోయాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అర్హులకు ఎంతో మేలు జరుగుతుంది.  

ప్రతి నెలా... ఎంపీడీవో కార్యాలయంలోనే..

* మూడేళ్లుగా ప్రభుత్వం ఆసరా దరఖాస్తులను పక్కన పెట్టగా..గతేడాది ఆగస్టులో కొత్త పింఛన్లు మంజూరు చేశారు. ఇందులో ఆయా విభాగాలుగా అర్హులను గుర్తించారు. ఇప్పటివరకు వితంతు విభాగం కింద దరఖాస్తులు చేసుకున్న మహిళలు నెలల తరబడి అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ప్రజావాణిలో విన్నపాలు కూడా ఇచ్చారు. ఫలితం కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు.  

* భర్త మృతి చెందిన వెంటనే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయటంతో పాటుగా భార్య వివరాలతో మండల పరిషత్‌ కార్యాలయంలోనే ఆసరా దరఖాస్తులు అందించాలని అధికారులు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. బాధితులను నెల వారిగా గుర్తించి లబ్ధికలిగించే విధంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. వితంతువులు పంచాయతీ కార్యదర్శులకు అవసరమైన పత్రాలు అందిస్తే ఎంపీడీవో కార్యాలయాల్లో ఆన్‌లైన్‌ చేయిస్తారు.


వివరాలు నమోదు చేస్తున్నాం
- పాండు, ఎంపీడీవో, బొంరాస్‌పేట.

అర్హుల వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. ఆసరా లబ్ధిదారుడు చనిపోయిన వెంటనే మరణ ధ్రువ పత్రం జారీ చేస్తున్న పంచాయతీ కార్యదర్శులే వివరాలు తీసుకుంటారు. మంజూరుకు ఎంపీడీవో కార్యాలయాల్లో ఆన్‌లైన్‌ చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని గ్రామాల్లోని అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు