logo

కొడంగల్‌కు నీళ్లు, నిధులు

సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లకు సమానంగా కొడంగల్‌కి నీళ్లు, నిధులు తీసుకొస్తానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్రలో భాగంగా దుద్యాల, కొడంగల్‌లో జరిగిన సమావేశాల్లో మాట్లాడారు.

Published : 27 Jan 2023 01:40 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

మదన్‌పల్లిలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి, నేతలు

బొంరాస్‌పేట, కొడంగల్‌, న్యూస్‌టుడే: సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లకు సమానంగా కొడంగల్‌కి నీళ్లు, నిధులు తీసుకొస్తానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్రలో భాగంగా దుద్యాల, కొడంగల్‌లో జరిగిన సమావేశాల్లో మాట్లాడారు. కేసీఆర్‌ తనపై కక్షగట్టి కొడంగల్‌లో ఓడిస్తే... మల్కాజిగిరి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌కు వెళ్లానని.. మళ్లీ జాతీయపార్టీ రాష్ట్ర పగ్గాలు పట్టానని అన్నారు. నియోజకవర్గాన్ని కేటీఆర్‌ దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి నాలుగేళ్లయినా.. అభివృద్ధి పనులు చేపట్టలేదని దుయ్యబట్టారు. కొత్త జిల్లాల పేరుతో కొడంగల్‌ను మూడు ముక్కలు చేశారని విమర్శించారు. కొడంగల్‌లో భారాస గెలిస్తే.. రెండేళ్లల్లోనే సాగుకు కృష్ణా జలాలు తెస్తామన్నారు. కానీ ఆ పనులు కాలేదన్నారు. నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకం మంజూరు జీవో 69ని, కృష్ణా- వికారాబాద్‌ రైల్వేలైన్‌ పనులకు రూ.350 కోట్ల నిధులు తానే తీసుకొస్తే ఇప్పటకీ పనులను చేపట్టలేదన్నారు. నియోజకవర్గంలో రెండుపడక గదుల నిర్మాణాలు ఎక్కడున్నాయో చూపిస్తే.. ఆ గ్రామంలో కాంగ్రెస్‌ ఓట్లు అడగదని లేకుంటే.. ఇక్కడి ప్రజలకు కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి గెలిపిస్తే.. ఇక్కడి ప్రాంతం అభివృద్ధికి నిధులు, నీళ్లు తీసుకువస్తానన్నారు. రాష్ట్రంలోనే కొడంగల్‌ను  నమూనాగా అభివృద్ధి చేసుకుందామని.. అందుకు ముఖ్యనాయకులు కష్టపడి పని చేయాలని కోరారు.

ప్రతి గింజను కొంటాం..

బొంరాస్‌పేట సమీపంలోని వేరుశనగ చేలల్లో పనిచేస్తున్న కూలీల్ని రేవంత్‌రెడ్డి పలుకరించారు.  వారు ఆయనతో మాట్లాడుతూ.. వేరుశనగ దిగుబడి తగ్గిందని గిట్టుబాటు ధర క్వింటాలుకు రూ.12వేలు కల్పిస్తే మేలని అన్నారు. మరికొందరు తమకు సర్కారు అందించే ఇల్లు, రేషన్‌కార్డులు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని ఆయన కూలీలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు ప్రశాంత్‌, నర్సింహులుగౌడ్‌, వెంకట్‌రాములుగౌడ్‌, రాంచంద్రారెడ్డి, వెంకటయ్య, అంజిల్‌రెడ్డి, నర్సింహులునాయుడు, జయకృష్ణ, మల్లేశ్‌ ఉన్నారు.

విజయవంతం చేయాలి: టీఆర్‌ఆర్‌  

దోమ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను విస్మరించి అనవసర విషయాలను చర్చకు తీసుకొస్తూ సమస్యలు సృష్టిస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు తమ్మన్నగారి రాంమ్మోహన్‌రెడ్డి (టీఆర్‌ఆర్‌) అన్నారు. గురువారం దోమ మండలం మైలారంలో శ్రీనివాసుని సన్నిధిలో పూజలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌గాంధీకి మద్దతుగా చేపట్టిన జోడో యాత్ర కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ చేసిన కృషిని గుర్తించేలా అవగాహన కల్పించాలన్నారు. పార్టీ దోమ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని