logo

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా పాలనాధికారిణి నిఖిల అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాలనాధికారి కార్యాలయంలోని మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు.

Published : 27 Jan 2023 01:40 IST

విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన, జాతీయ పతాకాన్ని ఎగుర వేస్తున్న నిఖిల

న్యూస్‌టుడే, వికారాబాద్‌: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా పాలనాధికారిణి నిఖిల అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాలనాధికారి కార్యాలయంలోని మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. పోలీసులు కవాతు నిర్వహించారు. అనంతరం పాలనాధికారి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, ఏఎస్పీ రషీద్‌తో కలిసి టాపులేని జీపులో మైదానంలో తిరిగారు. ఈ సందర్భంగా ఆమె వివిధ రంగాల్లో జిల్లా సాధించిన ప్రగతిని వివరించారు.  

* 2022- 23లో ఉపాధి హామీ పథకం కింద 1,82,104 మంది కూలీలకు 49,33,303 పని దినాలను కల్పించి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రైతులకు అవగాహన కల్పించి మోమిన్‌పేట, కుల్కచర్ల మండలాల్లో సెర్ఫ్‌ సహకారంతో ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పీఓ)ను మహిళా రైతులతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

* స్త్రీ నిధి ద్వారా 3,242 మహిళా సంఘాలకు రూ.36.84 కోట్ల రుణాలు మంజూరు చేశారన్నారు.  

* ఇప్పటి వరకు 61,608 ధరణి దరఖాస్తులు రాగా, 54,763 పరిష్కరించామని, మిగతా 6,845 దరఖాస్తులను త్వరలో కొలిక్కి తెస్తామన్నారు.  

* 2022- 23 సంవత్సరానికి 6,284 మందికి కేసీఆర్‌ కిట్లు అందించామన్నారు. 14,099 మంది గర్భిణిలకు చికిత్సలు నిర్వహించగా, వీరిలో 12,853 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగాయని కలెక్టర్‌ తెలిపారు.

పది రోజుల్లోనే రైతు బీమా చెల్లింపు

రైతుబీమా పథకం కింద రైతు ఏ కారణం చేత మృతి చెందినా పది రోజుల్లో రైతు కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లిస్తున్నామని, ఏడాదిలో 256 మంది రైతులు మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులకు రూ.12.8 కోట్లు చెల్లించామన్నారు.  

* జిల్లాలో 75 శాతం రాయితీపై గొల్ల, కురమ సంఘ సభ్యులకు రెండో విడత కార్యక్రమంలో భాగంగా 11,866 మంది లబ్ధిదారులకు యూనిట్‌కు 1,31,250 చొప్పున పంపిణీ చేయడానికి సన్నద్ధం అవుతున్నట్లు తెలిపారు.

* వానాకాలం వరి సాగుకు సంబంధించి జిల్లాలో 126 కొనుగోలు కేంద్రాల ద్వారా 17,616 మంది రైతుల నుంచి 96,701 మొట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌, జడ్పీ ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌, వికారాబాద్‌, పరిగి డీఎస్పీలు సత్యనారాయణ, కరుణసాగర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.


ఉత్తమ సేవలకు ప్రశంస

వికారాబాద్‌, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన 187 మంది ఉద్యోగులకు కలెక్టర్‌ నిఖిల, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఏఏస్పీ రషీద్‌లతో కలిసి ప్రశంసా పత్రాలు అందించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని మైదానంలో జరిగిన కార్యక్రమంలో వారు పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు