logo

హెచ్‌సీయూలో ప్రదర్శనల దుమారం

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శనల దుమారం కొనసాగుతోంది. ఇండియా- ది మోదీ క్వశ్చన్‌ పేరిట బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని నాలుగురోజుల క్రితం ఓ విద్యార్థిసంఘం ఆధ్వర్యంలో క్యాంపస్‌లో ప్రదర్శించారు.

Published : 27 Jan 2023 03:49 IST

విద్యార్థి సంఘాల పోటాపోటీ ఆందోళన

వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేస్తున్న  ఏబీవీపీ విద్యార్థులు

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శనల దుమారం కొనసాగుతోంది. ఇండియా- ది మోదీ క్వశ్చన్‌ పేరిట బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని నాలుగురోజుల క్రితం ఓ విద్యార్థిసంఘం ఆధ్వర్యంలో క్యాంపస్‌లో ప్రదర్శించారు. దీనిపై మరో విద్యార్థి సంఘం వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై అంతర్గత విచారణకు ఆదేశించారు. తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో నార్త్‌క్యాంపస్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ అంబేడ్కర్‌ చౌక్‌వద్ద గురువారం సాయంత్రం ‘కశ్మీర్‌ఫైల్స్‌’ సినిమా ప్రదర్శించేందుకు నిర్ణయించారు. అదే సమయంలో అక్కడే ఎస్‌ఎఫ్‌ఐవారు బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించేందుకు నిర్ణయించారు. రెండు సంఘాలు పోటాపోటీగా ఏర్పాట్లు చేసుకున్నాయి. గురువారం సా.6 గంటల ప్రాంతంలో ఏబీవీపీ విద్యార్థులు చిత్ర ప్రదర్శనకు అవసరమైన ప్రొజెక్టర్‌, తెరను అద్దెకు తీసుకొని వస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది మెయిన్‌గేటువద్ద అడ్డుకున్నారు. విద్యార్థుల నుంచి ప్రొజెక్టర్‌, తెరను లాక్కున్నారు. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. అనంతరం విద్యార్థులు ప్రధానగేటు బయట బైఠాయించారు. కశ్మీర్‌ఫైల్స్‌ చిత్ర ప్రదర్శన అడ్డుకుని, బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనకు మాత్రం భద్రత కల్పించడం శోచనీయమని ఏబీవీపీ విద్యార్థి నాయకుడు మహేశ్‌ మండిపడ్డారు. అనంతరం మరో ప్రొజెక్టర్‌, తెర తెప్పించి కశ్మీర్‌ఫైల్స్‌ సినిమాను నార్త్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద ఏబీవీపీ ప్రదర్శించింది. ఎస్‌ఎఫ్‌ఐవారు బీబీసీ డాక్యుమెంటరీ పార్ట్‌-1, పార్ట్‌-2ను ప్రదర్శించారు. వర్సిటీలో చిత్రాలను, డాక్యుమెంటరీలను ప్రదర్శించాలంటే స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ డీన్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల రిజిస్ట్రార్‌ దేవేశ్‌ నిగమ్‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం చేసిన చిత్రాల ప్రదర్శనకు వర్సిటీ అనుమతి విషయమై అధికారులు ప్రకటన చేయలేదు. తమకు ఫిర్యాదూ అందలేదని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ స్పష్టం చేశారు. ఈ క్రమంలో విద్యార్థి బృందాలకు డీన్‌ స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. శాంతిభద్రతల సమస్యల నేపథ్యంలో క్యాంపస్‌లో సినిమాలు ప్రదర్శించవద్దన్నారు. త్వరలో జరిగే సెమిస్టర్‌ పరీక్షలకు సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించినట్లు ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు