logo

Hyderabad: బేకరీ ఫ్రాంచైజీ ఇస్తానంటూ రూ.కోట్లు వసూలు

బేకరీ ఫ్రాంచైజీలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి 20 మందిని నిండా ముంచాడు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల దాకా వసూలు చేసి రూ.కోట్లలో టోకరా వేశాడు.

Updated : 27 Jan 2023 08:04 IST

అబ్దుల్‌ కరీమ్‌

ఈనాడు, హైదరాబాద్‌: బేకరీ ఫ్రాంచైజీలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి 20 మందిని నిండా ముంచాడు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల దాకా వసూలు చేసి రూ.కోట్లలో టోకరా వేశాడు. డబ్బు ఇచ్చినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసిఫ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఆసిఫ్‌నగర్‌ సీఐ సీహెచ్‌ శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. మంగళ్‌హాట్‌కు చెందిన అబ్దుల్‌ కరీమ్‌.. మురాద్‌నగర్‌కు చెందిన ఫాతిమాను ఫోన్‌ ద్వారా సంప్రదించి, మురాద్‌నగర్‌లో ఉన్న తన ఇంటిని బేకరీ ఫ్రాంచైజీకి ఇస్తానని నమ్మించి 2021 ఆగస్టులో రూ.5 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. ఏడాది లీజు కోసం తన సోదరులు అబ్దుల్‌ రెహ్మాన్‌, ఎండీ మునీర్‌, ఎండీ అజీమ్‌ల సమక్షంలో ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏడాది పూర్తయినా ఫ్రాంచైజీ ఇవ్వకపోవడంతో డబ్బు తిరిగివ్వాలని కోరగా.. నెల రోజుల సమయం కోరాడు. ఎంతకీ డబ్బు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి కరీమ్‌ గురించి వాకబు చేయగా అసలు ఇంటి యజమాని అతను కాదని, అబ్దుల్‌ ముఖీద్‌ అని తెలుసుకున్నారు. అబ్దుల్‌ కరీమ్‌ ఇదే తరహాలో దాదాపు 20 మంది నుంచి డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరీమ్‌ రూ.కోట్లలో వసూలు చేశాడని ఒక బాధితురాలు మీడియాతో వాపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు