logo

Hyderabad: భారీ యంత్రాలతో.. దక్కన్‌మాల్‌ కూల్చివేత మొదలు

సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌లో అగ్నిప్రమాదం సంభవించిన దక్కన్‌ మాల్‌ భవనం కూల్చివేత పనులను బల్దియా అధికారులు ప్రారంభించారు.

Updated : 27 Jan 2023 10:01 IST

మాల్‌ వద్ద సిద్ధంగా ఉన్న క్రేన్‌

ఈనాడు, హైదరాబాద్‌, రెజిమెంటల్‌ బజార్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌లో అగ్నిప్రమాదం సంభవించిన దక్కన్‌ మాల్‌ భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయాన్నే మాల్‌ కూల్చివేతను బల్దియా అధికారులు మొదలుపెట్టారు. భారీ క్రేనుతో కంప్రెషర్‌ యంత్రాన్ని భవనంపైకి తీసుకెళ్లి.. క్రేన్‌తో అలాగే పట్టి ఉంచి ఒక్కో స్లాబును కూల్చివేస్తున్నారు. దీంతో భవనం చుట్టు పక్కల పరిసర ప్రాంతాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేటి నుంచి వారం రోజుల వ్యవధిలో భవనం కూల్చివేతను పూర్తి చేసేలా బల్దియా ప్లాన్ చేసింది.

అంతకుముందు హైడ్రామా చోటు చేసుకుంది. కూల్చివేతకు సంబంధించి రూ. 33.86 లక్షల అంచనా వ్యయంతో టెండరు నోటిఫికేషన్‌ ఇవ్వగా..రూ.25.94లక్షలకే పని చేస్తామని ఎస్‌.కె.మల్లు కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ బుధవారం పని దక్కించుకుంది.  గురువారం ఉదయాన్నే మాల్‌ కూల్చివేతకు యంత్ర సామగ్రితో సిద్ధమైంది. సాయంత్రానికి జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం ఎస్‌.కె క్రాంటాక్టును రద్దు చేసింది. టెండరులో పాల్గొని రూ.33లక్షలకు పని చేస్తామన్న మాలిక్‌ ట్రేడర్స్‌కు పని అప్పగించింది. గుత్తేదారు  పొడవైన జేసీబీని తెచ్చి పనులు ప్రారంభించారు. కూల్చివేత వల్ల  సమీప బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి తలసాని భరోసా ఇచ్చారు.

మళ్లీ మంటలు.. ఆందోళన

దక్కన్‌ మాల్‌ భవనంలో గురువారం రాత్రి మళ్లీ మంటలు రేగాయి. వెంటనే సమాచారం అందుకు న్న అగ్నిమాపకశాఖ సిబ్బంది ఫైరింజన్‌ను తీసుకొచ్చి మంటలను ఆర్పేసింది. వారం తర్వాత కూడా భవనంలో మంటలు రేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని