logo

గుర్తించేందుకు చిప్‌లేదు.. క్యూఆర్‌ కోడే

రహదారులపై రాకపోకలు సాగించే వాహన యజమానుల వివరాలు.. వాహనం నడుపుతున్న డ్రైవర్‌ లైసెన్స్‌ సంక్షిప్త సమాచారాన్ని తెలిపే ‘చిప్‌’కార్డులకు రవాణాశాఖ స్వస్తి చెప్పింది.

Updated : 27 Jan 2023 13:25 IST

సాదాసీదాగా డ్రైవింగ్‌ లైసెన్సులు.. వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: రహదారులపై రాకపోకలు సాగించే వాహన యజమానుల వివరాలు.. వాహనం నడుపుతున్న డ్రైవర్‌ లైసెన్స్‌ సంక్షిప్త సమాచారాన్ని తెలిపే ‘చిప్‌’కార్డులకు రవాణాశాఖ స్వస్తి చెప్పింది. ఆర్సీలు, డ్రైవింగ్‌ లైసెన్సులపై ‘క్యూఆర్‌’ కోడ్‌ను ముద్రించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక గుత్తేదారుకు చెల్లించాల్సిన పాతబకాయిలే కారణమని తెలిసింది. చిప్పులు కావాలంటే వాటిని సరఫరా చేస్తున్న గుత్తేదారుకు రూ.5 కోట్లకు పైగా పాత బకాయిలు చెల్లించాలి. ఈ నేపథ్యంలో వాటి స్థానంలో ‘క్యూఆర్‌’ కోడ్‌ను ముద్రించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ కోడ్‌ను స్కాన్‌ చేస్తే.. సంబంధిత సమాచారం తెలుస్తుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు తనిఖీల వేళ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు  

పాత బకాయిల పీటముడి.. కొత్త వాహనాలు కొన్నవారికి, డ్రైవింగ్‌ లైసెన్సులు పొందేవారికి ‘చిప్‌’తో కూడిన కార్డును రవాణాశాఖ అధికారులు కొన్నేళ్లుగా ఇస్తున్నారు. ఆర్నెల్ల నుంచి ఈ కార్డులు సక్రమంగా రావడం లేదు. గుత్తేదారుకు రూ.కోట్లలో బకాయిలు ఉండడమే కారణమని తేలింది. డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీల కోసం దరఖాస్తు చేసిన వ్యక్తుల నుంచి ముందుగానే వినియోగఛార్జీలు వసూలు చేస్తున్నందున.. గుత్తేదారుకు సక్రమంగా బిల్లులు ఇస్తున్నారని ఉన్నతాధికారులు భావించారు. తద్భిన్నంగా రూ.5 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని ముంబయిలో ఉంటున్న గుత్తేదారు.. అధికారులకు చెప్పారు. గతంలో విధులు నిర్వహించిన ఒక అధికారి బిల్లులపై సంతకం చేయకుండా వెళ్లడం, ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించిన వారూ సమస్య పరిష్కారానికి చొరవచూపకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

సులువుగా గుర్తించొచ్చు.. డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీలపై ఉండే చిప్‌ను సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో రూపొందిస్తున్నారు. ప్రతి వాహనం నంబర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ సంఖ్యను రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయాల్లో నమోదు చేయగానే... డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీచేసిన రవాణాశాఖ కార్యాలయం, జిల్లా, రాష్ట్రం ఆ చిప్‌ ద్వారా తెలుస్తాయి. ఇతర రాష్ట్రాల్లోనూ అక్కడి తనిఖీ అధికారులు చిప్‌ను స్కాన్‌ చేయగానే.. వాహనం వివరాలు తెలిసిపోతాయి.

* కార్లు, బైకులు, ఇతర వాహనాలను దొంగతనాలు చేసిన నేరస్థులు.. వాటితో పారిపోతున్నప్పుడు సరిహద్దుల్లో అధికారులు, ఇతర రాష్ట్రాల పోలీసులు ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌పై ఉన్న చిప్‌ను స్కాన్‌ చేస్తే... అది అసలు వాహనమా? నకిలీదా? అని తేలిపోతుంది. నేరస్థులు ఆ రిజిస్ట్రేషన్‌ పత్రాలను మార్చలేరు.

* అనూహ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు కార్లు, బైకులు, మినీ బస్సుల్లో ప్రయాణిస్తున్నవారు గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పుడు ఈ చిప్‌ల ద్వారా పోలీసులు వారి వివరాలు తెలుసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని