logo

అభినయ కౌశలం..ఆత్మీయ బంధం

కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న అలనాటి సినీ నటి జమున మరణవార్త విని ఫిలింనగర్‌ బోరుమంది. తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది

Updated : 28 Jan 2023 04:32 IST

రవీంద్రభారతి, ఫిలింనగర్‌ న్యూస్‌టుడే: కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న అలనాటి సినీ నటి జమున మరణవార్త విని ఫిలింనగర్‌ బోరుమంది. తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. బంజారాహిల్స్‌లోని ఆమె ఇంటికి, ఫిలింనగర్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌ ప్రాంగణానికి పలువురు సినీ రంగ ప్రముఖులతో పాటు సామాన్యులు, సినీ కార్మికులు భారీగా తరలివచ్చి జమున పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె నటించిన చిత్రాలు చిరకాలం చెరగని గురుతులుగా నిలిచిపోతాయని కొనియాడారు. ఫిలింనగర్‌తో జమునకు విడదీయలేని అనుబంధం ఉంది. ఫిల్మ్‌ఛాంబర్‌లో జరిగే అనేక సినీ కార్యక్రమాల్లో తరచూ ఆమె పాల్గొనేవారు. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన తర్వాత సినీ రంగ ప్రముఖులు ఫిలింనగర్‌లోనే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రామానాయుడు, పద్మాలయ స్టూడియోలు సైతం ఇక్కడే ఉండేవి. దీంతో ఇక్కడి వారితో ఆమెకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. జమున కూతురు స్రవంతి చిత్రకారిణి. బంజారాహిల్స్‌లో జరిగే పెయింటింగ్‌ ప్రదర్శనలను కూతురితో కలిసి సందర్శించేవారు. ఆమె ఇంట్లో అడుగు పెడితే.. అందర్ని ఆకట్టుకునేలా కూతురు వేసిన అందమైన పెయింటింగ్స్‌ దర్శనమిస్తాయి.

సాంస్కృతికోత్సవాల్లో..

అభినయకౌశలంతో ‘సత్యభామ’ను ప్రేక్షకుల కళ్లముందు సాక్షాత్కరింపజేసిన జమున అయిదారు నెలల క్రితం వరకు రవీంద్రభారతి, త్యాగరాయగానసభ, తెలుగువర్సిటీలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియం తదితర వేదికలపై జరిగే సాంస్కృతికోత్సవాల్లో పాల్గొని అందరి హృదయాలకు హత్తుకునేలా మంచి మాటలు చెప్పేవారు. ఆడపిల్లలకైతే జాగ్రత్తలు చెప్పేవారు. జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి. ప్రస్తుత సమాజ పోడకలను గురించి చెప్పేవారు.

అప్పటికే కథానాయిక...

* మద్రాస్‌ నుంచి తెలుగు సినిమా కథానాయకుల్లో అక్కినేని నాగేశ్వరరావు తొలిసారిగా 1963లో హైదరాబాద్‌కు తరలివచ్చారు. దాదాపు పదేళ్ల తరువాత 1972లో జమున నగరానికి చేరుకున్నారు. ఆమె భర్త ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేసేవారు. ఆమె హైదరాబాద్‌కు తరలివచ్చేనాటికే సినిమాల్లో కథానాయికగా కొనసాగుతున్నారని సినీ చరిత్రకారుడు సంగమం సంజయ్‌ కిషోర్‌ పేర్కొన్నారు. ‘చాలా మంది జమున చేతిరాత ముత్యాల్లాగా ఉంటుందని చెప్పేవారు.. ఆమె పెద్ద కథానాయిక అయినప్పటికీ సాధారణ మహిళలాగే కనిపించేవారు. చిన్న పిల్లల మనస్తత్వం’ అని వివరించారు.
పలు సత్కారాలు.
* గతేడాది వంశీ ఇంటర్నేషనల్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆమెకు వంశీ-ఆళ్ల స్వర్ణకంకణం బహూకరించారు.  కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో ఆమె జన్మదినోత్సవం సందర్భంగా నటుడు గిరిబాబు, మండలి బుద్ధప్రసాద్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ప్రభాకరరావు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి, ఓలేటి పార్వతీశం  ఇటీవల సన్మానించారు.

ట్రస్ట్‌తో సేవ..

* జమునా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నెలకొల్పి ఎంతో మందిని ఆదుకున్నారు. ‘జిక్కి’కి క్యాన్సర్‌ వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే..  సంగమం ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తనవంతుగా రూ.25 వేలు  అందజేశారు.

‘జమున మృతి తీరని లోటు’

గౌతంనగర్‌: సినీనటి జమున మృతి కళా ప్రపంచానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వ సంగీత, నాటక అకాడమి సభ్యురాలు, ప్రముఖ కూచిపూడి నాట్య గురువు డాక్టర్‌ ఎస్పీభారతి అన్నారు. శుక్రవారం గౌతంనగర్‌లో ఆమె మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా జమునతో కలిసి అనేక కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నట్లు తెలిపారు. తన పీహెచ్‌డీ పరిశోధనలో జమున ముఖ్య భూమిక పోషించారని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు