logo

‘చందమామ’తో రచయితనయ్యా

చిరిగిన చొక్కానైనా వేసుకో.. మంచి పుస్తకం కొనుక్కో అనేది నానుడి. ఆ బాలుడు మాత్రం పాఠశాలలో విరామ సమయంలో చిరుతిళ్లు కొనుక్కోవడానికి ఇచ్చిన డబ్బులను దాచుకుని చందమామ మాస పత్రిక కొనుక్కునేవాడు

Updated : 28 Jan 2023 04:28 IST

పరిశోధనతో పీహెచ్‌డీ అందుకున్న వెంకటరమణ

ఈనాడు, హైదరాబాద్‌: చిరిగిన చొక్కానైనా వేసుకో.. మంచి పుస్తకం కొనుక్కో అనేది నానుడి. ఆ బాలుడు మాత్రం పాఠశాలలో విరామ సమయంలో చిరుతిళ్లు కొనుక్కోవడానికి ఇచ్చిన డబ్బులను దాచుకుని చందమామ మాస పత్రిక కొనుక్కునేవాడు. రెండేళ్లు తిరిగే సరికి కథలు చదువుతున్నప్పుడు తనే ఎందుకు రాయకూడదని ఆలోచనతో మొదటిసారి ఒక కథను రాశాడు. ఏ పత్రికకూ పంపలేదు. 1980 మే నెల నుంచి ప్రతినెల మాస పత్రికను కొనుక్కొని భద్రపర్చడం మొదలెట్టారు. 1981లో రెండు కథలు రాసి చందమామకు పంపితే ఒక కథ ప్రచురితం అయ్యింది. నీకేంలాభం పేరుతో 1982 నాటి సంచికలో ప్రచురితం అయ్యింది. పెరిగి పెద్దయినా వాటిని చదవడం మాత్రం ఆపలేదు. అది మొదలు చందమామ కథలు చదువుతూ.. రాస్తూ బాలసాహిత్యం రచయితగా మారారు దాసరి వెంకటరమణ. కొందరు పుస్తకాలు భద్రంగా దాచిపెట్టుకుంటే.. వెంకటరమణ మాత్రం అభిమానంతో వాటిపై ఏకంగా పీహెచ్‌డీనే చేశారు. ‘మొదట్లో పది కథలు పంపితే ఒక కథ ప్రచురితం అయ్యేది. తర్వాతర్వాత పది కథలు పంపితే ఒకటి వెనక్కి వచ్చేది. 1947 జులై నాటి మొదటి చందమామ నుంచి 2013 అక్టోబరు చివరి చందమామ మాస పత్రిక వరకు 766 సంచికలు సేకరించాను. 1950వ దశకంలోని కొన్ని సంచికలు తప్ప అన్నీ సేకరించాను. ఈ క్రమంలో పరిశోధన చేయాలన్పించింది. 2004లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలో చేరాను. ఉద్యోగ పని ఒత్తిడిలో పరిశోధన చాలాకాలం పాటూ కొనసాగింది. జనవరి 27న అధికారికంగా నాకు పీహెచ్‌డీ పట్టాను ప్రకటించారు’ అని వెంకటరమణ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని