logo

వజ్రాలు కొట్టేసి... రైల్లో పరారీ

గుజరాత్‌ వ్యాపారులను మోసగించి విలువైన వజ్రాలు చోరీ చేసిన అంతర్రాష్ట్ర దొంగను అఫ్జల్‌గంజ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 28 Jan 2023 02:33 IST

వివరాలు చెబుతున్న  డీసీపీ సునీల్‌

ఈనాడు, హైదరాబాద్‌ బేగంబజార్‌, న్యూస్‌టుడే: గుజరాత్‌ వ్యాపారులను మోసగించి విలువైన వజ్రాలు చోరీ చేసిన అంతర్రాష్ట్ర దొంగను అఫ్జల్‌గంజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. రూ.18 లక్షల విలువైన వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సుల్తాన్‌బజార్‌ ఏసీపీ దేవేందర్‌, అప్జల్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రవీందర్‌రెడ్డి, డీఐ ఎ.సతీష్‌లతో కలిసి తూర్పుమండలం డీసీపీ సునీల్‌దత్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. కర్ణాటక చిక్కబల్లాపూర్‌ జిల్లా అలీపురవాసి మహ్మద్‌ రుహిల్లా(31) రంగురాళ్ల వ్యాపారి. వ్యాపారంలో నష్టపోయి సులువుగా డబ్బు సంపాదించేందుకు మోసాలబాట పట్టాడు. ఇండియా మార్ట్‌ వెబ్‌సైట్‌లో బంగారు ఆభరణాలు, వజ్రాలు విక్రయించే వారి సమాచారం పరిశీలించాడు. సూరత్‌లో జె.కె.ఎంటర్‌ ప్రైజెస్‌ వజ్రాల వ్యాపారులకు ఈ నెల 18న ఫోన్‌ చేశాడు. హైదరాబాద్‌ వచ్చి ఫోన్‌ చేస్తే వజ్రాలు కొనుగోలు చేస్తానన్నాడు. ఈ నెల 23న వ్యాపారులు వివేక్‌జైన్‌ ఝావేరి, పరష్వా మొరాఖియా నగరంలోని సిద్దంబర్‌బజార్‌ మహవీర్‌భవన్‌లో బస చేసినట్లు రుహిల్లాకు ఫోన్‌ ద్వారా సమాచారమిచ్చారు. తాము తెచ్చిన వజ్రాలు పరిశీలించుకోవచ్చన్నారు. 24న నగరానికి చేరిన నిందితుడు అఫ్జల్‌గంజ్‌లోని హోటల్‌ గదిలో దిగాడు. 25న ఉదయం 11 గంటలకు మహవీర్‌భవన్‌కు వెళ్లిన నిందితుడు వజ్రాలు, ప్యాకింగ్‌లను పరిశీలించాడు. తానున్న లాడ్జికి వస్తే బేరం కుదుర్చుకోవచ్చంటూ వ్యాపారులను ఆహ్వానించాడు.

పెన్‌  కావాలంటూ దృష్టి మరల్చాడు.. వ్యాపారులు వచ్చేలోపు వారి వద్ద ఉన్న వజ్రాల ప్యాకింగ్‌ను పోలినట్టు రంగురాళ్లతో ప్యాకింగ్‌ తయారు చేశాడు. వారు వచ్చాక దృష్టి మరల్చి నకిలీ ప్యాకెట్‌ను ఇచ్చాడు. వజ్రాలకు నగదు చెల్లించేందుకు సమయం పడుతుందంటూ బురిడీ కొట్టించాడు. అదే రోజు మరో కొనుగోలుదారును కలిసేందుకు వెళ్లిన వ్యాపారులు అక్కడ వజ్రాల ప్యాకెట్‌ను పరిశీలించి నకిలీవిగా గుర్తించారు. మాయగాడు పారిపోయినట్లు తెలుసుకుని అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టరు రవీందర్‌, డీఐ సతీష్‌ బృందం .. వ్యాపారులతో నిందితుడు మాట్లాడిన ఫోన్‌ నంబరు ఆధారంగా కూపీ లాగారు. సీసీఫుటేజీ ఆధారంగా బెంగళూరు రైల్వేస్టేషన్‌ చేరినట్లు నిర్ధారణకు వచ్చారు. 24 గంటల్లో అతడిని అరెస్టుచేసిన అఫ్జల్‌గంజ్‌ పోలీసులను సీపీ సీవీ ఆనంద్‌ అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని