logo

జమునకు ప్రముఖుల నివాళి

జమున మృతి వార్త తెలిసి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు.

Updated : 28 Jan 2023 04:27 IST

బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, రాయదుర్గం, న్యూస్‌టుడే: జమున మృతి వార్త తెలిసి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు. మాజీ ఎంపీ మురళీమోహన్‌, అల్లు అరవింద్‌, మా అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మాదాల రవి, సినీనటులు మంచు లక్ష్మీ, రోజారమణి, దామోదర్‌ప్రసాద్‌,  ఆర్‌.నారాయణమూర్తి, మాజీ స్పీకరు మధుసూదనాచారి, వేణుగోపాలాచారి, ప్రముఖ వైద్యురాలు డాక్టర్‌ కేవీ కృష్ణకుమారి, ఏపీ మంత్రి రోజా, వైతెపా నాయకురాలు లక్ష్మీపార్వతి, ఫిలింనగర్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ కార్యదర్శి కాజ సూర్యనారాయణ, ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెనరసింహ తదితరులు వారిలోఉన్నారు.

జన హృదయ అభినేత్రి...  నటుడు ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ, ప్రజానాట్యమండలి కళాకారుడు గరికపాటి రాజారావు తీసిన పుట్టిల్లు చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయమైన జమున ప్రస్థానం రారాణిగా కొనసాగిందన్నారు. జన హృదయ అభినేత్రిగా అభివర్ణించారు. నాటితరం మేటి నటులంతా మృతి చెందుతుండటం ఎంతో బాధాకరంగా ఉందని మాజీ స్పీకరు మధుసూదనాచారి పేర్కొన్నారు. జమునతో దశాబ్దాల అనుబంధం ఉందని,  కలుద్దామని అనుకున్నానని, ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదని డాక్టర్‌ కేవీ కృష్ణకుమారి ఆవేదన వ్యక్తం చేశారు.

అలనాటి సినీ నటి జమున ను కడసారి చూసేందుకు ఫిలింనగర్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌కు సినీ ప్రముఖులు తరలివచ్చారు. ఆమె భౌతిక కాయాన్ని నిర్మాతలు డి.సురేష్‌బాబు, నటులు జీవిత, రాజశేఖర్‌, నటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, మాజీ ఎంపీ    టి.సుబ్బిరామిరెడ్డి, సినీ నటుడు మురళీమోహన్‌, మా అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మాదాల రవి తదితరులు సందర్శించి నివాళులు    అర్పించారు.  మధ్యాహ్నం 2గంటల సమయంలో భౌతికకాయాన్ని ఆమె నివాసం నుంచి ఫిలింఛాంబర్‌కు తరలించారు. సాయంత్రం 4గంటల సమయంలో ఫిలింఛాంబర్‌ నుంచి జమున అంతిమయాత్ర ప్రారంభమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని