logo

ఉసూరుమంటున్న..ఉపకార పథకం!

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. అయితే వీటిపై సరైన అవగాహన లేకపోవడంతో  సద్వినియోగం చేసుకోవడంలేదు.

Published : 28 Jan 2023 02:59 IST

ఒక్క అర్జీ రాని వైనం
న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. అయితే వీటిపై సరైన అవగాహన లేకపోవడంతో  సద్వినియోగం చేసుకోవడంలేదు. శ్రమజీవులకు ప్రత్యేకంగా సంక్షేమ మండలి ద్వారా సేవలందిస్తున్నారు. ఇందులో పేరు నమోదు చేసుకున్న వారికి వైద్య ఖర్చులు, సహజ, ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. అంతే కాకుండా కార్మికుల పిల్లలలకు ఉపకార వేతనాలు మంజూరు చేస్తున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క అర్జీ రాకపోవడం శోచనీయం.

పదో తరగతి నుంచే

ఈ విద్యా సంవత్సరానికి పదో తరగతి నుంచి పీజీ కోర్సు చేసే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి ఐటీఐ విద్యార్థులకు రూ. వెయ్యి, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.1500, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, న్యాయవిద్య, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏకు రూ.2 వేలు చెల్లిస్తారు. ఆయా కోర్సుల్లో వచ్చిన మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి మేడే నాటికి వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. దరఖాస్తులను కలెక్టరేట్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో పొందవచ్చు. పూర్తి చేసిన వాటిని ఫిబ్రవరి 15 లోగా అందజేయాలి. అర్హులైన వారికి ఏడాదికి ఒకసారి రూ.వెయ్యి నుంచి రెండు వేల వరకు చెల్లిస్తారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఏడాదికి ఒకసారి రూ.4 వేల చొప్పున ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ద్వారా పొందుతున్నా, అదనంగా కార్మిక సంక్షేమ మండలి నుంచి పొందవచ్చు.

అమలులో ఉన్నా.. స్పందన లేదు

జిల్లాలో సుమారుగా లక్షా 40 వేల మంది కార్మికులు ఉన్నారు. దుకాణాలు, కర్మాగారాల్లో, మోటారు రవాణా రంగంలో పని చేస్తున్న వారు, సహకార సంస్థల్లో ధార్మిక లేదా ఇతర ట్రస్టుల్లో పని చేస్తున్న కార్మికుల పిల్లలు అర్హులు, ఈ పథకం 25 ఏళ్ల నుంచి అమలులో ఉంది. అయినా జిల్లాలో సక్రమంగా ఉపయోగించుకున్నవారు లేరు. గతేడాది ఒక్కరు కూడా దరఖాస్తు చేయలేదు. ఈ సారి కూడా అదే పరిస్థితని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌ తగిన చొరవ తీసుకుని విద్యార్థులతో దరఖాస్తు చేయించాలి. అంతేకాకుండా కార్మిక అధికారులు తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సంక్షేమనిధికి చెల్లిస్తేనే

ఉపకార వేతనాలు పొందాలంటే కార్మికులు మూడేళ్లపాటు ఏటా రూ.7 చొప్సున సంక్షేమ నిధికి రుసుం చెల్లించాలి. చాలా మంది కార్మికులు ఈ రుసుం సక్రంగా చెల్లించటం లేదు. అంతే కాకుండా ఉపకారవేతనం తక్కువగా ఉంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వెయ్యి, రెండు వేలు ఇస్తారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇది చాలా తక్కువ ఉపకార వేతనమే. దీంతో కూడా ముందుకు రావటం లేదని సమాచారం. పెంచితే బాగుంటుందని కోరుతున్నారు.


ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాం: శ్రీనివాస్‌రావు, జిల్లా కార్మిక అధికారి

ఈ విషయంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాం. పత్రికా ప్రకటనలు ఇచ్చాం. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాం. ఈ విషయంలో పాఠశాల, కళాశాల యాజమాన్యం తగిన చొరవ చూపాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు