logo

వేరుసెనగ ఆశాజనకం!

బోర్లు, బావులు ఉన్నప్పటికీ పంట మార్పిడి నేపథ్యంలో చాలా మంది రైతులు వానాకాలం సీజన్‌లో కంది, పత్తి, పెసర, మినుము సాగు చేశారు

Updated : 28 Jan 2023 04:25 IST

చేతికి అందుతున్న దిగుబడులు

న్యూస్‌టుడే,తాండూరు: బోర్లు, బావులు ఉన్నప్పటికీ పంట మార్పిడి నేపథ్యంలో చాలా మంది రైతులు వానాకాలం సీజన్‌లో కంది, పత్తి, పెసర, మినుము సాగు చేశారు. అధిక వర్షాలు కురిసి నష్టాలనే మూట గట్టుకున్నారు. వరి సాగు చేసిన వారు మాత్రమే ఆర్థిక ప్రయోజనం పొందారు. ఇక యాసంగికి సంబంధించి అక్టోబరు, నవంబరు ద్వితీయార్థం వరకు వేరుసెనగ విత్తనాలు వేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 21,600 ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం నాలుగు నెలల కాలపరిమితి పూర్తయినవి దిగుబడులు చేతికి అందడంతో విక్రయించి గిట్టుబాటు ధరను పొందుతున్నారు.

ఎకరాకు 10 క్వింటాళ్లపైనే

జిల్లాలో ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున దిగుబడులు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ లెక్కన సాగులో ఉన్న మొత్తం పంట నుంచి 2.16 లక్షల క్వింటాళ్లు రావొచ్చు. క్వింటాకు రూ.5,850 చొప్పున మద్దతు ధరను ప్రకటించింది. ఈ లెక్కన విక్రయించే ఉత్పత్తుల నుంచి రూ.126 కోట్లకు పైగా ఆర్జించనున్నారు. దేశీయంగా నూనె ఉత్పత్తికోసం మిల్లర్లు కొనుగోలుకు పోటీ పడటంతో, క్వింటాకు రూ.7,200 ధర పలుకుతోంది. తక్కువగా రూ.6,800 లభిస్తోంది. తాండూరు విపణిలో ఈనెల 21 నుంచి విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 500 క్వింటాళ్లు విక్రయించారు. సీజన్‌ పూర్తయ్యే ఏప్రిల్‌ వరకు ధరలు ఇలాగే స్థిరంగా ఉంటే మరింత ప్రయోజనం చేకూరనుంది.
మహారాష్ట్రకు ఎగుమతి: తాండూరు, వికారాబాద్‌, ధారూర్‌, పరిగి తదితర విపణుల్లో ఉత్పత్తులను ట్రేడర్లు కొనుగోలు చేస్తున్నారు. వీరు మహారాష్ట్రలోని నూనె మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు. మరో వైపు సూపర్‌ మార్కెట్ల యజమానులు మిల్లర్ల నుంచి ఒకే పరిమాణంలో ఉన్న పలుకులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంతో డిమాండు పెరిగింది.


నాణ్యమైనవి కావడంతో..: రాజేశ్వరి, విపణి కార్యదర్శి, తాండూరు

విపణిలో రైతులు విక్రయిస్తున్న ఉత్పత్తులకు ఆశాజనకమైన ధరలు లభిస్తున్నాయి. విక్రయానికి వస్తున్న కాయలు కూడా నాణ్యమైనవి కావడంతో ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. దీంతో రైతులకు లాభిస్తోంది. ఏప్రిల్‌ వరకు అమ్మకాల జోరుగా జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని