logo

సేవలకు దూరం.. అన్నదాతకు కష్టం

అన్నదాతలకు వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతి క్లస్టరులో కోట్లాది రూపాయలు వెచ్చించి రైతు వేదికలను నిర్మించింది.

Published : 29 Jan 2023 02:37 IST

ఊరి చివర నిరుపయోగంగా రైతు వేదికలు
న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌, దోమ 

అన్నదాతలకు వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతి క్లస్టరులో కోట్లాది రూపాయలు వెచ్చించి రైతు వేదికలను నిర్మించింది. ఇది రైతులకు ఊరటనిచ్చే విషయమైనా వేదికలు గ్రామాలకు చాలా దూరంగా ఉండటంతో ప్రయోజనం లేకుండా పోతోంది. వాటి నిర్వహణ కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. మంచినీరు, కరెంటు, మూత్రశాలలు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన చాలా చోట్ల నేటికీ పూర్తికాలేదు. దీంతో ఇటు రైతులు, అటు సిబ్బందికి ఇబ్బందులు తప్పడంలేదు.

రూ.21.34కోట్లతో..

జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో 6.81లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా 97 క్లస్టర్లు ఉన్నాయి. 19 మండలాల్లో 2,79,724 రైతులు ఉన్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం 97 రైతు వేదికల నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.21.34కోట్లను ఖర్చు చేసింది.

కనీస సదుపాయాలూ లేవు

రైతు వేదికల్లో కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఏఈఓలు కూడా అక్కడ ఉండేందుకు ఇష్టపడటం లేదు. నిత్యం అక్కడకు వెళ్లిన తరువాతే క్షేత్ర సందర్శనకు వెళ్లాలని ప్రభుత్వం ప్రత్యేకించి ఆదేశాలు జారీ చేసినా వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.  సరైన రక్షణ లేకపోవడంతో కొన్నిచోట్ల పోకిరీలకు, పశువులకు నిలయంగా మారాయి.

కొన్ని ఉదాహరణలు

* దోమ మండలం దాదాపూర్‌ గ్రామానికి అర కిలోమీటరు దూరంలో రైతు వేదిక ఉంది. పొలాలకు వెళ్లే దారి కావడంతో రాకపోకలకు అనువుగా లేదు.  
* ఇదే మండలంలోని బ్రాహ్మణ్‌పల్లి రైతు వేదికలో కరెంటు, మంచినీటి సదుపాయం లేదు. శౌచాలయాలు అసంపూర్తిగా ఉన్నాయి. ః పరిగి మండలం రంగాపూర్‌లోనూ ఊరికి దూరంగా ఉంది.  
* పెద్దేముల్‌ మండలం కందనెల్లిలో ఏర్పాటు చేసిన వేదిక వర్షం పడిన ప్రతిసారి వరద నీరంతా వేదిక భవనంలోకి వచ్చి చేరుతోంది. ఇది గుట్టకు కింద భాగంలో నిర్మించడంతో ఇబ్బందిగా మారింది.
* వికారాబాద్‌ మండలం మైలార్‌ దేవరంపల్లిలో రైతు వేదిక 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే గ్రామానికి చెందిన వారు తప్ప క్లస్టరు పరిధిలో ఉన్న పీలారం, రాళ్ల చిట్టంపల్లి, అత్వెల్లి, కొంపల్లి, గోధుమగూడ, సర్పన్‌పల్లి, జైదుపల్లి, గంగారం గ్రామాలకు చెందిన రైతులు దూరాభారంగా మారడంతో ఎవరూ ఆసక్తి చూపడం లేదు. 

ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం : - గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

రైతు వేదికల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. తమ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉంటూ  అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో అసంపూర్తి పనులను పూర్తిచేసేలా ప్రయత్నిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని