logo

గనుల తవ్వకం.. కుదరదిక ఇష్టారాజ్యం

జిల్లాలోని ప్రభుత్వ భూముల్లో ఖనిజాలను తవ్వి విక్రయించడానికి గనుల శాఖ ఇక మీదట ఈ-వేలం పద్ధతిని అమల్లోకి తీసుకు రానుంది.

Published : 29 Jan 2023 02:37 IST

ఏప్రిల్‌ నుంచి ఈ- వేలం పద్ధతి అమలు  
న్యూస్‌టుడే, తాండూరు, వికారాబాద్‌

జిల్లాలోని ప్రభుత్వ భూముల్లో ఖనిజాలను తవ్వి విక్రయించడానికి గనుల శాఖ ఇక మీదట ఈ-వేలం పద్ధతిని అమల్లోకి తీసుకు రానుంది. 2023 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనుంది. దీనివల్ల లీజు యజమానుల ఇష్టారాజ్యానికి చెల్లుచీటీ పాడినట్లవుతుంది. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుతుంది. 

మొదటి దశలో 50 ఎకరాల్లో..

జిల్లాలో మొదటి దశ కింద ప్రభుత్వ పరిధిలోని 50 ఎకరాల్లో (20 హెకార్టర్లు) ఖనిజాలను తవ్వుకోవడానికి గనుల శాఖ ఈ-వేలం తీసుకొస్తోంది. సిద్దులూరు, మీనపల్లి కలాన్‌, పూడూరు, గోవిందాపూరు, మన్‌సాన్‌పల్లి గ్రామాల్లో లేటరైట్‌ ఖనిజం తవ్వకాలకు నిర్ణయం తీసుకుంది. దోమ, వికారాబాద్‌, కొడంగల్‌, మోమిన్‌పేట మండలాల్లో స్టోన్‌ మెటల్‌ తవ్వకాలు 20 సంవత్సరాల పాటు తవ్వు కోవచ్చు. 

పాత పద్ధతిలో ఎవరికి తోచినట్లు వారు..

పాత పద్ధతిలో ప్రభుత్వ భూముల్లో ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికే అనుమతులు ఇచ్చే వ్యవస్థ ఉండేది. ఈ విధానంలో రాజకీయ పలుకుబడితో పాటు ఆర్థికంగా ఉన్న వారు ప్రభుత్వ భూముల్లో ఖనిజాలను తవ్వకాలకు అనుమతులు పొందారు. ఒక హెక్టారు భూమిలో అనుమతులు పొంది పక్కనే ఉన్న మిగిలిన భూముల్లో అనధికారికంగా తవ్వకాలు జరుపుతూ వచ్చారు. ఇక మీదట అలా జరగదు. ఈ-వేలంలో దక్కించు కోవాల్సిందే. అక్రమ తవ్వకాలకు ఆస్కారం ఉండదు. గనుల శాఖ నిర్ణీత బిడ్‌కు సంబంధించిన భూమిని ముందస్తుగానే సాంకేతికతను జోడించిన హద్దులను నిర్ణయిస్తుంది. ఎన్ని టన్నుల ఖనిజాలను వెలికి తీయవచ్చో అంచనా వేస్తుంది. పరిమితికి మించి తవ్వకాలు జరిగినట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తుంది.

పదిరెట్లు పెరిగిన డెడ్‌ రెంట్‌

గతంలో హెక్టారు పట్టా భూమిలో ఖనిజాల తవ్వకాలకు అనుమతి పొందాక నిర్ణీత డెడ్‌రెంటును గనుల శాఖకు చెల్లిస్తే సరిపోయేది. అప్పుడు హెక్టారు నాపరాయి గనికి రూ.80వేలు, సుద్దకు రూ.లక్ష, లేటరైట్‌కు రూ.40వేలు, స్టోన్‌ మెటల్‌కు రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉండేది. కొత్త పద్ధతిలో పదింతల డెడ్‌రెంట్‌ చెల్లించాల్సి ఉంది. 

అదనపు ఆదాయం రూ.20కోట్లకు పైనే..

ఈ-వేలంతో పాటు మారిన డెడ్‌రెంట్‌ ప్రకారం జిల్లా గనుల శాఖకు అదనంగా రూ.20 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుందని ప్రాథమిక అంచనా. ప్రస్తుతం లీజు పొందిన 228 అన్ని రకాల గనుల్లోంచి ఖనిజాలను వెలికి తీయడం ద్వారా రాయల్టీ రూపంలో ఏడాదికి రూ.83 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. కొత్త పద్ధతిలో  సమకూరే ఆదాయంతో రూ.100 కోట్లకు పైబడి ఉంటుంది. కొత్త విధానం అమలు వల్ల అదనపు ఆదాయం సమకూరుతుందని తాండూరు గనుల శాఖ సహాయ సంచాలకులు సాంబశివరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు