logo

‘ప్లేటు’ ఫిరాయింపులపై నజర్‌

నంబరు ప్లేటు లేని వాహనాలపై దూసుకెళ్లినా.. రిజిస్ట్రేషన్‌ నంబరు ట్యాంపర్‌ చేసినా.. కటకటాలు లెక్కపెట్టేందుకు సిద్ధంగా ఉండాల్సిందే.

Published : 29 Jan 2023 02:37 IST

ఈనాడు- హైదరాబాద్‌: నంబరు ప్లేటు లేని వాహనాలపై దూసుకెళ్లినా.. రిజిస్ట్రేషన్‌ నంబరు ట్యాంపర్‌ చేసినా.. కటకటాలు లెక్కపెట్టేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. నగరంలో వాహనాల నంబరు ప్లేటు ఉల్లంఘనలపై ఇప్పటి వరకు చలానాలతో సరిపెట్టిన పోలీసులు తాజాగా కేసులు నమోదు చేస్తున్నారు. సదరు వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. నడిపే వ్యక్తి చరిత్ర తెలుసుకొని క్రిమినల్‌ కేసులు పెడుతున్నారు. ఇటీవల గొలుసు దొంగలు  నంబరు ప్లేటు లేని వాహనాలే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా ఇలాంటి ద్విచక్రవాహనాలను గుర్తిస్తున్నారు.

ఉల్లంఘనలు వేలల్లో..

ఇటీవల ఉప్పల్‌, హబ్సిగూడ, రాంగోపాల్‌పేట ఠాణాల పరిధిలో గంటల వ్యవధిలో ఏడు చోట్ల చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. తస్కరించిన బైకును నిందితులు ఇందుకు వాడారు. నిందితుల కోసం పోలీసులు  వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా వందల సంఖ్యలో తప్పుడు నంబర్‌ ప్లేట్లు వాడుతున్న వాహనాలను గుర్తించారు. దాదాపు 500 వాహనాలను స్వాధీనం చేసుకొని, 70 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. రాచకొండ ట్రాఫిక్‌ విభాగం అధికారులు తప్పుడు వాహనాలను గుర్తించేందుకు ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించగా.. 2,925 బండ్లు పట్టుబడ్డాయి. సైబరాబాద్‌ పోలీసులు 15 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టగా.. 2 వేల వాహనాలపై జరిమానాలు విధించారు.

ఏటా 3 లక్షలకుపైగా..

మూడు కమిషనరేట్ల పరిధిలో ఏటా నంబరు ప్లేటు ఉల్లంఘనలకు సంబంధించి 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ బెడద ఎక్కువగా ఉంటోంది. 2022లో సిటీ పరిధిలో 1.5 లక్షల ఉల్లంఘనలు నమోదయ్యాయి.

నిబంధనలు ఇలా..

* రవాణా శాఖ కేటాయించిన హైసెక్యూరిటీ నంబరు ప్లేటు మాత్రమే వినియోగించాలి.
* నంబరు ప్లేటు తెలుపు దానిపై అక్షరాలు నలుపు రంగులో ఉండాలి.
* రిజిస్ట్రేషన్‌ నంబరును ఏమార్చడం, అక్షరాలు, అంకెలు మార్చకూడదు
* ఫ్యాన్సీగా కనిపించేందుకు అంకెల్ని మార్చకూడదు.
* ఎవరైనా తప్పుడు రిజిస్ట్రేషన్‌ నంబరు వినియోగించినట్లు ప్రజల దృష్టికి వస్తే 100కు ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని