logo

బలం పెరిగిన సైబర్‌ దళం

నెట్టింట పెరుగుతున్న సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీసులు ప్రణాళికలు వేస్తున్నారు.

Published : 29 Jan 2023 02:35 IST

స్నేహా మెహ్రా(హైదరాబాద్‌), రితిరాజ్‌(సైబరాబాద్‌), బి.అనురాధ(రాచకొండ)

ఈనాడు- హైదరాబాద్‌: నెట్టింట పెరుగుతున్న సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీసులు ప్రణాళికలు వేస్తున్నారు. ఏటా రెట్టింపు స్థాయిలో పెరుగుతున్న కేసులు.. రికవరీ కష్టసాధ్యంగా మారుతోన్న నేపథ్యంలో మూడు కమిషనరేట్ల పరిధిలోని సైబర్‌ క్రైమ్‌ విభాగాలను మరింత బలోపేతం చేస్తున్నారు. తాజాగా జరిగిన బదిలీల్లో భాగంగా ప్రభుత్వం మూడు కమిషనరేట్ల సైబర్‌ క్రైమ్‌ విభాగాలకు డీసీపీ స్థాయి అధికారుల్ని అధిపతులుగా నియమించింది. ఇప్పటివరకూ ఏసీపీ స్థాయి అధికారులు వీటికి నేతృత్వం వహిస్తున్నారు.

కొత్త సాఫ్ట్‌వేర్‌.. జోన్ల వారీగా బాధ్యతలు

సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మోసాలు చేస్తున్నారు. వీరిని గుర్తించేందుకు సైబరాబాద్‌ కమిషనరేట్‌లో తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ సైబర్‌ సేఫ్టీ(టీఎస్‌పీసీసీ)ని ఏర్పాటు చేశారు. మరోవైపు హైదరాబాద్‌ పోలీసులు కొత్త సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దర్యాప్తులో భాగంగా నిందితుల మూలాలు గుర్తించడం కోసం సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నారు. కృత్రిమ మేధ వినియోగం, డిజిటల్‌ లైబ్రరీ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. సైబరాబాద్‌లో ప్రతి జోన్‌లో సైబర్‌ క్రైమ్‌ సమన్వయకర్తగా ఒక అధికారిని నియమించారు. ఆయా జోన్‌ పరిధిలోని ఠాణాల్లో నమోదయ్యే కేసులు, వాటి దర్యాప్తు, నియంత్రణ తీరుతెన్నులపై విశ్లేషించి సైబర్‌క్రైమ్‌ విభాగానికి అప్పగించడం వీరి బాధ్యత. ప్రస్తుతం ప్రతి ఠాణాలో ఇద్దరు కానిస్టేబుళ్లకు సైబర్‌ నేరాల తీరుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రూ.1.5 లక్షలోపు డబ్బు పోగొట్టుకున్న కేసుల్ని ఆయా ఠాణాల్లోనే నమోదు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని