logo

బకెట్‌ వివాదం.. తీసింది ప్రాణం

అనాథ విద్యార్థులు ఉండే వసతి గృహంలో జరిగిన చిన్నపాటి గొడవ శనివారం ఒకరి ఆత్మహత్యకు దారి తీసింది.

Published : 29 Jan 2023 02:12 IST

వీఎం హోం విద్యార్థి ఆత్మహత్య

సరూర్‌నగర్‌ క్రైం, న్యూస్‌టుడే: అనాథ విద్యార్థులు ఉండే వసతి గృహంలో జరిగిన చిన్నపాటి గొడవ శనివారం ఒకరి ఆత్మహత్యకు దారి తీసింది. సరూర్‌నగర్‌ పోలీస్‌ ఠాణా పరిధి కర్మన్‌ఘాట్‌లోని వీఎం హోం (విక్టోరియా మోమోరియల్‌)లో ఈ సంఘటన జరిగింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన బాలుడు(16) హోంలో పదో తరగతి చదువుతున్నాడు. పదేళ్ల కిందట తల్లిదండ్రులు మరణించడంతో ఆరేళ్ల క్రితం నగరానికి వచ్చి ఇక్కడ చేరాడు. అంతకు ముందు ఇతడి సోదరుడు కూడా ఇదే హోంలో ఉండి అయిదేళ్ల క్రితం వెళ్లిపోయాడు. శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో బాలుడికి తోటి విద్యార్థులు ముగ్గురితో నీటి బకెట్‌ కోసం గొడవ జరిగింది. మాటామాటా పెరిగి వివాదం ముదరడంతో వారి నుంచి తప్పించుకునేందుకు గోడ దూకి బయటకు వెళ్లాడు. శనివారం ఉదయం కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు ఓ బాలుడు ఉరేసుకుని ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే విద్యార్థి అదృశ్యంపై హోం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనిఫాం ఆధారంగా ఇతడు వీఎం హోం విద్యార్థి అని గుర్తించారు. సమాచారం అందుకున్న రాచకొండ ఓఎస్డీ మహేశ్‌, క్రైమ్‌ డీసీపీ మురళీధర్‌, సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త డైరెక్టర్లు గిరిష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి హోం వద్దకు చేరుకున్నారు. బాలుడి ఆత్మహత్య విషయం తెలుసుకున్న అతని బంధువులు పెద్ద ఎత్తున వచ్చి హోం ముందు ధర్నా చేపట్టారు. అధికారులు మృతుడి బంధువులతో చర్చించి రూ.5లక్షల పరిహారం చెక్కును సోదరుడికి అందచేశారు. రెండు పడక గదుల ఇల్లు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం కోసం వారు డిమాండ్‌ చేయగా సానుకూలంగా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని