logo

వారాంతం.. సాహితీ లోకంలో విహారం

బహుభాషల్లో కవితా పఠనం, పిల్లల కోసం నాటకాలు, కథలు చెప్పడం, కార్యశాలలు, సినిమా, చిత్రకళా ప్రదర్శనలు, సంగీత విభావరీలతో సైఫాబాద్‌ విద్యారణ్య హైస్కూల్‌లో హైదరాబాద్‌ సాహితీ వేడుక రెండో రోజు శనివారం సందడిగా సాగింది.

Updated : 29 Jan 2023 04:38 IST

సాహితీ వేడుకలోని పుస్తక ప్రదర్శనలో సందర్శకులు

ఈనాడు, హైదరాబాద్‌: సామాజిక, రాజకీయ అంశాలపై మేధావుల చర్చలు, కొత్త పుస్తకాల పరిచయాలు, కవులు, రచయితలతో మాటామంతి, బహుభాషల్లో కవితా పఠనం, పిల్లల కోసం నాటకాలు, కథలు చెప్పడం, కార్యశాలలు, సినిమా, చిత్రకళా ప్రదర్శనలు, సంగీత విభావరీలతో సైఫాబాద్‌ విద్యారణ్య హైస్కూల్‌లో హైదరాబాద్‌ సాహితీ వేడుక రెండో రోజు శనివారం సందడిగా సాగింది. వారాంతం కావడంతో పాఠశాల, కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై సాహితీ లోకంలో విహరించారు. ఆదివారం ఉ.10 నుంచి సా. 6 వరకు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. * సైన్స్‌లో మహిళలు, క్రీడల్లో మహిళలు, ఉర్దూ హరీస్‌లో మహిళలు.. ఇలా 8 భిన్న అంశాలపై చర్చాగోష్ఠిలు జరిగాయి. * కావ్యధారలో వేర్వేరు భాషల్లో కవిత పఠనం నిర్వహించారు. స్టేజ్‌ టాక్‌ షోల్లో ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రేమ పాఠాలపై ప్రియరమణి మాట్లాడారు. * ఆరోగ్యకర ఆహారం, వస్త్రాలు నేయడం, సహజ రంగుల వాడకం, సమయపాలనపై కార్యశాలలు నిర్వహించారు. * లైవ్‌ మ్యూజిక్‌ అలరించింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ పాటలతో సంగీతం కుర్రకారును ఉర్రూతలూగించింది. యువగళాలు తమ ప్రతిభను ప్రదర్శించాయి. * డాక్యుమెంటరీలను మూవింగ్‌ ఇమేజెస్‌ టాకీస్‌లో ప్రదర్శించారు. హైదరాబాద్‌లోని రాతి సంపదను పరిరక్షించుకోవాల్సిన ప్రాముఖ్యతను తెలిపే ‘ది అదర్‌ కోహినూర్స్‌’, ‘ఇది కథ మాత్రమేనా?’ చిత్రాలను ప్రదర్శించారు. సాయంత్రం ముగింపులో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

వివిధ భాషల అక్షరమాల


యువ సందడి

ఏదైనా సాధించగలం అని చెప్పేందుకే
పర్వతారోహకురాలు మాలావత్‌ పూర్ణ

బాలికలు ఏదైనా చేయగలరని నిరూపించేందుకే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించానని పర్వతారోహకురాలు మాలవత్‌ పూర్ణ అన్నారు. ఓయూలో రాజనీతి శాస్త్రంలో ఎం.ఎ. పూర్తి చేసిన తాను వ్యాపకాన్నే వృత్తిగా మల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పూర్ణపై పుస్తకం మొదట తెలుగులో రాయాలని భావించినా.. ఎక్కువ మంది చేరాలనే ఉద్దేశంతో ఆంగ్లంలో రాసిన రచయిత అపర్ణ తోట తెలిపారు. పాఠశాలలో వాలీబాల్‌ ఆడేటప్పుడు చెట్లు, భవనంపై బంతి పడితే పూర్ణ చకచకా ఎక్కి తీసుకొచ్చేవారని అపర్ణ గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్టు ఉమాసుధీర్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.


మహిళా శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం అంతంత మాత్రమే..

నారాయణగూడ: మహిళా శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం అంతంత మాత్రమేనని, లింగవివక్షను ఎదుర్కొంటున్నారని అని వక్తలన్నారు. ఉమెన్‌ ఇన్‌ సైన్స్‌ పేరిట చర్చాగోష్ఠికి.. సగరి రాందాస్‌ సమన్వయకర్తగా వ్యవహరించగా.. నస్రీన్‌ ఎతేశామ్‌ మాట్లాడారు.. ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమి, బీడీపీ వంటి సంస్థల్లో ఉన్నత స్థాయి పదవుల్లో మహిళలు నామమాత్రమేనన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు