logo

నిధులు వస్తేనే.. నీరు పారేను!

జిల్లాలో కోట్‌పల్లి, జుంటుపల్లి, సర్పన్‌పల్లి, లక్నాపూరు ప్రధాన జలాశయాల కింద 17,214..ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలు, తూములు, గైడ్‌వాల్స్‌ చాలా చోట్ల దెబ్బతినడంతో నిర్ణీత ఆయకట్టు మొత్తానికి సాగు నీరు అందడం లేదు.

Published : 30 Jan 2023 00:54 IST

జిల్లాలో కోట్‌పల్లి, జుంటుపల్లి, సర్పన్‌పల్లి, లక్నాపూరు ప్రధాన జలాశయాల కింద 17,214..ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలు, తూములు, గైడ్‌వాల్స్‌ చాలా చోట్ల దెబ్బతినడంతో నిర్ణీత ఆయకట్టు మొత్తానికి సాగు నీరు అందడం లేదు. కేవలం 7,500 ఎకరాలకు మాత్రమే పారుతోంది. మిగిలిన పొలాల్లో  రైతులు వర్షాధారంగా పంటలు సాగు చేస్తున్నారు. రెండో పంటగా యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటలు సాగు చేసే పరిస్థితి లేక బీళ్లుగా ఉంచుతున్నారు. అధికారుల ప్రతిపాదనలు ఆమోదం పొందితే, పనులు చేపట్టి పూర్తి చేస్తే ప్రాజెక్టుల ఆశయం నెరవేరుతుంది.

న్యూస్‌టుడే, తాండూరు, ధారూరు, వికారాబాద్‌ గ్రామీణ, పెద్దేముల్‌


తూములు శిథిలం

జిల్లాలోనే కోట్‌పల్లి జలాశయం అతిపెద్దది. దీని పరిధిలో ధారూర్‌, పెద్దేముల్‌ మండలాల 18 గ్రామాలకు చెందిన 9,200 ఎకరాలకు నీటిని అందించాలి. ప్రధాన కాలువలతోపాటు, తూములు, గైడ్‌వాల్స్‌ ఎక్కడికక్కడ శిథిలమయ్యాయి. కొన్ని చోట్ల ఆనవాళ్లు లేకుండా పోయాయి. నీటిని వదిలిన ప్రతి సారి వృథాగా పోతోంది. నిర్ణీత ఆయకట్టులో కేవలం 4000 ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతోంది. మరమ్మతుకు రూ.40 కోట్లు అవసరముంటుందని అంచనా.


800 ఎకరాలకు..

యాలాల మండలం జుంటిపల్లి ఎగువ నుంచి కాగ్నానదిలోకి వెళ్లే నీటిని నిలువరించి జుంటిపల్లి ప్రాజెక్టు నిర్మించారు. యాలాల, బషీరాబాద్‌ మండలాల్లోని ఏడు గ్రామాల పరిధిలో 2,082 ఎకరాలకు సాగు నీటిని అందించాలన్నది లక్ష్యం. ఇందుకు తగ్గట్టు 1959లోనే కుడి, ఎడమ కాలువలు నిర్మించారు. అయితే మరమ్మతుకు వచ్చాయి. నీటిని వదిలిన ప్రతి సారి వృథా ఎక్కువగా ఉంటోంది. 800 ఎకరాలకు నీరు అందుతోంది. పనులకు రూ.10 కోట్లు కావాల్సి ఉంది.


నిర్వహణ కొరవడి

వికారాబాద్‌, ధారూర్‌ మండలాల్లోని ఏడు గ్రామాలకు చెందిన 3,285 ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు సర్పన్‌పల్లి ప్రాజెక్టు నిర్మించారు. గత పదిహేనేళ్ల వరకు నిర్ణీత ఆయకట్టుకు సాగు నీరు అందడంతో రైతులు రెండో పంటగా ఆరుతడి పంటలను సాగు చేసి లాభాలను ఆర్జించారు. కాలువలు, తూముల నిర్వహణ సవ్యంగా లేకపోవడంతో అధ్వానంగా మారాయి. నీటిని వదిలితే 1200 ఎకరాలకు మించి పారడం లేదు. మిగిలిన భూములకు పారడంలేదు. కొందరు అప్పులు చేసి బోర్లు వేసుకున్నారు. రూ.5 కోట్లు వెచ్చిస్తే ప్రయోజనం ఉంటుంది.


కాలువలు దెబ్బతిని

లక్నాపూర్‌ ప్రాజెక్టు కింద 2,647 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. పరిగి, వికారాబాద్‌ నియోజకవర్గాల్లోని 8 గ్రామాల పరిధిలోని భూములకు సాగు నీటిని అందించాలన్నది లక్ష్యం. కుడి కాలువ కింద 1,132, ఎడమ కాలువ కింద 1,515 ఎకరాలకు నీరందాలి. అయితే రెండు ప్రధాన కాలువలు మరమ్మతుకు వచ్చాయి. కొన్నిచోట్ల పంపిణీ కాలువలు దెబ్బతిన్నాయి. తూములు శిథిలమయ్యాయి. 1,500 ఎకరాలకే నీరు అందుతోంది. మరమ్మతులకు రూ.4 కోట్ల నుంచి రూ.6కోట్లు కావాలి.


రూ.55 కోట్లతో అంచనాలు రూపొందిస్తున్నాం..

సుందర్‌, జిల్లా నీటి పారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీరు, వికారాబాద్‌

జిల్లాలోని ప్రధాన జలాశయాల కాలువలు, తూములను మరమ్మతు చేయడానికి రూ.55 కోట్లు కావాలి. ఈమేరకు అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించే పనుల్లో ఉన్నాం. నిధులు మంజూరైతే పూర్తి స్థాయిలో పనులు చేపట్టి, చివరి ఆయకట్టుకు నీటిని అందిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని