logo

ధరణి.. మారతున్న ధోరణి

అపరిష్కృత భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ధరణి పోర్టల్‌లో టీఎం-1 నుంచి మొదలుకుని టీఎం-33 వరకు ఐచ్ఛికాలు ప్రవేశపెట్టిన విషయం విధితమే.

Published : 30 Jan 2023 00:54 IST

అసంపూర్తి అర్జీల పరిష్కారానికి కొత్త ఐచ్ఛికం

దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, వికారాబాద్‌: అపరిష్కృత భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ధరణి పోర్టల్‌లో టీఎం-1 నుంచి మొదలుకుని టీఎం-33 వరకు ఐచ్ఛికాలు ప్రవేశపెట్టిన విషయం విధితమే. పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో పాటు గ్రీవెన్స్‌ ల్యాండ్‌ మ్యాటర్స్‌ పేరిట అపరిష్కృత సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నారు. అవగాహన లేకపోవడంతో సరైన వివరాలు పొందుపర్చకపోవడంతో ఎక్కువ శాతం తిరస్కరణకు గురవుతున్నాయి. మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు వ్యయభారమవుతోంది. ఈ పరిస్థితిని నివారించేందుకు కర్షకుల పోర్టల్‌లో పెండింగ్‌ టు అప్లికేంట్‌(రివర్టెడ్‌ అప్లికేషన్స్‌) పేరిట కొత్త ఐచ్ఛికాన్ని ప్రవేశపెట్టింది.

కొరవడిన ప్రచారం..: అసంపూర్తి అర్జీలను తిప్పి పంపించే ఐచ్ఛికాన్ని పోర్టల్‌లో ఇటీవలే ప్రవేశపెట్టారు. అధికారులు సరైన ప్రచారం కల్పించకపోవడంతో దరఖాస్తు చేసుకోవడం లేదు. దీంతో మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు వరంగా మారింది. తిరస్కరణకు గురైనట్లు చెబుతూ రైతుల నుంచి తిరిగి రుసుం వసూలు చేస్తున్నారు. అటు సమస్య పరిష్కారం కాకపోవడంతో పాటు, ఇటు ఆర్థిక భారం పడి అన్నదాతలు నష్టపోతున్నారు. ఇకనైనా రెవెన్యూ యంత్రాంగం స్పందించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.


వ్యయ భారం లేకుండా..

* భూ లావాదేవీలను పారదర్శకంగా చేపట్టే నిమిత్తం ప్రభుత్వం పోర్టల్‌లో పలు ఐచ్ఛికాలను తీసుకొచ్చింది. సమస్యకు సంబంధించి ఐచ్ఛికం ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వాటి నుంచి చేస్తే తిరస్కరణకు గురవుతాయి.

* నిబంధనల ప్రకారం ఒక్కో అర్జీకి మీ సేవ కేంద్రంలో రూ.1100 నుంచి రూ.1500 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అవగాహన కొరవడి దరఖాస్తులను అసంపూర్తిగా పూరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే రద్దవుతాయి.

* ఎన్నిసార్లు తిరస్కరిస్తే అన్నిసార్లు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనిని నివారించేందుకు సరైన ఫార్మట్‌లో సమర్పించాలి.

* తాజాగా అవసరమైన దస్త్రాలు జోడించని వాటిని పెండింగ్‌ అప్లికేంట్‌ పేరిట తిరిగి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుదారునికి చేరవేస్తున్నారు. అవసరమైన వివరాలు పొందుపర్చి పంపితే పరిశీలించి పరిష్కరిస్తారు.


నిబంధనల ప్రకారం చేస్తే ఇబ్బందులుండవు

అశోక్‌కుమార్‌, జిల్లా రెవెన్యూ అధికారి

సమస్యకు తగిన ఐచ్ఛికం ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురికావు. అపరిష్కృత భూ సమస్యల పరిష్కారం దిశగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కార్యాచరణ రూపొందించాం. అసంపూర్తిగా ఉన్నవాటిని తిప్పి పంపుతున్నాం. దీని వల్ల మళ్లీ రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదు. నిర్దేశిత పత్రాలు జోడించి పంపితే సమస్యలు పరిష్కరిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని