logo

మల్లన్న సన్నిధిలో లష్కర్‌ వారం

కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో(ఆది)వారం మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

Published : 30 Jan 2023 00:54 IST

ఆలయ రాజగోపురం వద్ద బోనాల రద్దీ

చేర్యాల, న్యూస్‌టుడే: కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో(ఆది)వారం మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ‘లష్కర్‌ వారం’గా పిలిచే ఈ ఆదివారం సికింద్రాబాద్‌కు చెందిన భక్తులు ఎక్కువగా తరలివచ్చారు. స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో హాజరయ్యారు. శనివారం సాయంత్రం నుంచే రాక మొదలైంది. వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, సంగారెడ్డి, నల్గొండ జిల్లాలే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి తరలివచ్చారు. శనివారం ధూళి దర్శనం చేసుకున్నారు. పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి బస చేసి ఆదివారం ఉదయం కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. అందంగా అలంకరించిన బోనాలు నెత్తిన పెట్టుకొని పూనకాలతో కొండపై వెలిసిన రేణుకా ఎల్లమ్మ గుడికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మల్లన్న స్వామి దర్శనానికి క్యూలైన్లు కిక్కిరిశాయి. రేణుకా ఎల్లమ్మ ఆలయ స్వాగత తోరణం దాటి కిలోమీటరు దూరం భక్తులు నిల్చున్నారు. మూడున్నర గంటల సమయం పట్టింది. ఈఓ బాలాజీ, పాలక మండలి ఛైర్మన్‌ గీస భిక్షపతి, కమిటీ సభ్యులు ఇబ్బంది కలగకుండా పర్యవేక్షించారు. అదనపు డీసీపీ సందెపోగు మహేందర్‌, సిద్దిపేట జిల్లా ట్రాఫిక్‌ ఏసీపీ ఫణీందర్‌ నేతృత్వంలో ఎస్సైలు చంద్రమోహన్‌, భాస్కర్‌రెడ్డితో పాటు మొత్తం 80 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎన్‌సీసీ విద్యార్థులు సేవలు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని