logo

డిమాండ్‌ ఎంతయినా.. పవర్‌ తగ్గేదేలె

నగర శివార్లలో పెద్దఎత్తున డేటా కేంద్రాలు రాబోతున్నాయి. ఔటర్‌ బయట ఏర్పాటుకు ఇప్పటికే పలు ప్రాంతాలను ఆయా సంస్థలు ఎంపిక చేస్తున్నాయి.

Published : 30 Jan 2023 03:34 IST

శివారులో డేటా కేంద్రాలతో కరెంట్‌ వినియోగం పైపైకి
దశలవారీగా సరఫరాకు విద్యుత్తు సంస్థల ఏర్పాట్లు

మీర్‌ఖాన్‌పేటలో నిర్మాణంలో ఉన్న డేటా కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: నగర శివార్లలో పెద్దఎత్తున డేటా కేంద్రాలు రాబోతున్నాయి. ఔటర్‌ బయట ఏర్పాటుకు ఇప్పటికే పలు ప్రాంతాలను ఆయా సంస్థలు ఎంపిక చేస్తున్నాయి. కొన్నిచోట్ల కేంద్రాల ఏర్పాటు పనులు మొదలవగా.. మిగతా ప్రాంతాల్లో దశలవారీగా రానున్నాయి.  ఈ కేంద్రాలు పని చేసేందుకు అధిక కరెంట్‌ వినియోగం అవసరం ఉంటుంది.  అమెజాన్‌ 120 మెగావాట్లు, మైక్రోసాఫ్ట్‌ 160 మెగావాట్లు కరెంట్‌ కావాలని విద్యుత్తు సంస్థలను కోరాయి. మొదట డేటా కేంద్రాలు తక్కువ సామర్థ్యంతో ఏర్పాటు చేసి క్రమంగా పెంచుకుంటూ వెళతామని.. అందుకు అనుగుణంగా కరెంట్‌ను సరఫరా చేయాలని కోరాయి. ప్రస్తుతం 33 మెగావాట్ల సామర్థ్యం కల్గిన డేటా కేంద్రాలు మాత్రమే నగరంలో పనిచేస్తున్నాయి.

క్లౌడ్‌ సేవలకు డిమాండ్‌ పెరగడంతో డేటా కేంద్రాల అవసరం పెరుగుతోంది. ఇదివరకు ఈ కేంద్రాలు ఎక్కువగా ముంబయిలో ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయి. అమెజాన్‌ ఇండియా ఫార్మాసిటీ, ఫ్యాబ్‌సిటీ, చందనవెల్లిలో డేటా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.  మైక్రోసాఫ్ట్‌ అతిపెద్ద డేటా క్లస్టర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుకు నిర్ణయించింది. చందన్‌వెల్లి, ఎల్లికట్ట, మేకగూడలో వీరి కేంద్రాలు రాబోతున్నాయి. వీటికి సమీపంలోనే తమ 400కేవీ, 220కేవీ ఉపకేంద్రాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ట్రాన్స్‌కో అంటోంది.

* ఫార్మాసిటీ మీర్‌ఖాన్‌పేటలో మహేశ్వరం 400కేవీ విద్యుత్తు ఉపకేంద్రం ఉంది. ఇక్కడి నుంచి ఫార్మాసిటీలోని డేటా కేంద్రానికి సరఫరా చేసే సామర్థ్యం ఉంది.

* చందన్‌వెల్లిలో 220/132కేవీ ఉపకేంద్రం అందుబాటులో ఉంది.

* ఇతర కేంద్రాలకు కరెంట్‌ సరఫరా చేసేందుకు నెట్‌వర్క్‌ సిద్ధంగా ఉందని అధికారులు అంటున్నారు. అవసరమైన చోట కొత్త లైన్లు వేస్తామని చెబుతున్నారు.


గేటెడ్‌ కమ్యూనిటీలకు..

డేటా కేంద్రాలే కాదు.. శివార్లలో ముఖ్యంగా ఇన్నర్‌ రింగ్‌రోడ్డు చుట్టుపక్కల 30 నుంచి 40 అంతస్తుల ఆకాశహర్మ్యాలు వస్తున్నాయి. ఇక్కడ ఒక్కో కమ్యూనిటీలో మూడువేల నుంచి నాలుగువేల ఇళ్లు వస్తున్నాయి. ఒక్కోదానికి 30మెగావాట్ల వరకు కరెంట్‌ డిమాండ్‌ ఉంటుంది. ఈ తరహా ప్రాజెక్టుల్లో బల్క్‌ కనెక్షన్‌ తీసుకుని అంతర్గతంగా వారు కరెంట్‌ సరఫరా చేసుకుంటారు. ఇందుకోసం ఏకంగా 33కేవీ హెచ్‌టీ కనెక్షన్‌ తీసుకుంటారు.  


రింగ్‌తో సౌలభ్యం..

సిటీ చుట్టూ 400కేవీ రింగ్‌ను సీఎం ఆదేశాల మేరకు ట్రాన్స్‌కో ఏర్పాటు చేసింది.  ఒక ఉపకేంద్రంలో ఏదైనా సమస్య వచ్చినా ఇబ్బంది లేకుండా ఇతర చోట్ల నుంచి కరెంట్‌ సరఫరా చేసేందుకు వీలుగా రింగ్‌ను కలిపారు. ఇందుకోసం మధ్యలో ఖాళీగా ఉన్న కొంతదూరం 142 సర్క్యూట్‌ కిలోమీటర్ల ఓవర్‌హెడ్‌ లైన్లను వేశారు. దీంతో సిటీ చుట్టూ ఉన్న 400కేవీ 6 విద్యుత్తు ఉపకేంద్రాలు ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యాయి. ఇందుకోసం అవసరమైన చోట కొత్తగా 220 కేవీ ఉపకేంద్రాలను సిటీ చుట్టూ పక్కల నిర్మించారు. దీంతో డేటా కేంద్రాలు శివార్లలో ఎక్కడ వచ్చినా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యుత్తు సంస్థలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని