logo

స్వామీ.. ఈ భారమేమి?

దేవాలయాల ఈవోలపై పని ఒత్తిడి పెరుగుతోంది.. ఒక్కొక్కరికీ 10 నుంచి 15 ఆలయాల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో వాటి అభివృద్ధికి పూర్తిస్థాయి సమయం కేటాయించలేకపోతున్నారు.

Published : 30 Jan 2023 03:34 IST

ఒక్కొక్కరు 15 ఆలయాలకు ఇంఛార్జులుగా నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: దేవాలయాల ఈవోలపై పని ఒత్తిడి పెరుగుతోంది.. ఒక్కొక్కరికీ 10 నుంచి 15 ఆలయాల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో వాటి అభివృద్ధికి పూర్తిస్థాయి సమయం కేటాయించలేకపోతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల పరిధిలోని ఆలయాల్లో మొత్తం 30 మంది ఈవోలు పని చేస్తున్నారు. వీరంతా గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 బాధ్యతల్లో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ పరిధిలోనే వీరంతా పనిచేస్తున్నారు. వీరికి సుమారు 500కు పైగా దేవాలయాల నిర్వహణ, నిత్యం పూజలు, భక్తుల సౌకర్యాలు, ఆలయాల ఆస్తులు, భూముల నిర్వహణ, అద్దెల వసూలు, లీజులు, టెండర్లు ఇలా అనేక వ్యవహారాలను చక్కబెట్టాల్సిన బాధ్యతలున్నాయి. వీరి పరిధిలో ఉన్న దేవాలయాల మధ్య కనీసం 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉండటంతో వెళ్లి రావడానికే సుమారు 4 గంటల సమయం పడుతోంది.

ఇదీ పరిస్థితి..  వికారాబాద్‌కు చెందిన ఓ ఈవోకు 18 ఆలయాల బాధ్యతలను అప్పగించారు. వికారాబాద్‌లోని ఆలయానికి సుమారు 43 ఎకరాలు, యాచారంలో 1500 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలో 39 ఎకరాలు, రాజేంద్రనగర్‌ ఆలయానికి 44 ఎకరాలు, హయత్‌నగర్‌లో 5 ఎకరాల భూములున్నాయి. రాజేంద్రనగర్‌ ఆలయానికి చెందిన 90 శాతం భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఇందులో 7 హైకోర్టులో కేసులు విచారణలో ఉండగా, ఎండోమెంట్‌ ట్రైబ్యునల్‌లో 16 విచారణ దశలో ఉన్నాయి. కూకట్‌పల్లిలోని ఓ ఆలయ ఈవోకు అత్తాపూర్‌లో అదనపు బాధ్యతలు అప్పగించగా కోర్టు గొడవలతో సతమతమవుతున్నారు.
అసిస్టెంట్‌ కమిషనర్‌కూ..: రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ పరిధిలో వికారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల ఆలయాలున్నాయి. సోమవారం ఆయా జిల్లాల్లో జరిగే జనవాణి కార్యక్రమానికి ఎటువెళ్లాలో తేల్చుకోలేని పరిస్థితి.


ప్రతినెలా కొత్త కేసులు

దేవాదాయశాఖ అధికారులు 750కి పైగా కేసులు వేసి 2,357 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 3,103 ఎకరాలపై కేసులు నడుస్తున్నాయి. ఇవి ఎండోమెంట్‌ ట్రైబ్యునల్‌తో పాటు, సివిల్‌ కోర్టులు, హైకోర్టుల్లో ఉన్నాయి. ఈ కేసుల  వాయిదాలకు ఈవోలు హాజరవుతున్నారు. దీంతో  ఆలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఖాళీలున్నా ఏళ్లుగా భర్తీ చేపట్టకపోవడంతో ఉన్నవారిపైనే మరింత భారం పడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు