logo

నరదోషం తొలగిస్తానంటూ.. బంగారంతో మాయం

పూజలు చేసి దోషాలు తొలగిస్తానంటూ మహిళలను మోసంచేస్తున్న వ్యక్తిని ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 30 Jan 2023 03:34 IST

స్వాధీనం చేసుకున్న సొత్తును చూపుతున్న డీసీపీ సాయిశ్రీ

నాగోలు, న్యూస్‌టుడే: పూజలు చేసి దోషాలు తొలగిస్తానంటూ మహిళలను మోసంచేస్తున్న వ్యక్తిని ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఎల్బీనగర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డీసీపీ సాయిశ్రీ మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన విభూది రాములు(64) నగరంలోని భూపేష్‌గుప్తానగర్‌ గ్రీన్‌ల్యాండ్‌ కాలనీలో ఉంటున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని భావించి.. మహిళల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడసాగాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం హస్తినాపురం సమీపంలోని ఇంద్రప్రస్థకాలనీలో నివసించే ఓ మహిళను.. నరదోషం తొలగిస్తానంటూ మభ్యపెట్టాడు. తొలుత బియ్యం, నీరు, పాత్రను తెమ్మని కోరాడు. అనంతరం పాత్రలో పోసిన బియ్యంలో బంగారు మంగళసూత్రాన్ని వేయమనడంతో.. ఆమె అలాగే చేసింది. ఆపై పసుపు తెచ్చేందుకు మహిళ వంటింట్లోకి వెళ్లగా.. మంగళసూత్రంతో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఎల్బీనగర్‌ ఠాణా, ఎస్‌వోటీ పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఆరు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేశారు. బంగారు మంగళసూత్రాన్నీ స్వాధీనం చేసుకున్నారు.


ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు

ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టుచేశారు. డీసీపీ సాయిశ్రీ వివరాల ప్రకారం... ఏపీలోని నంద్యాల జిల్లా బనగానపల్లెకు చెందిన గడ్డం హుస్సేన్‌రెడ్డి(44) హైడ్రాలిక్‌ క్రేన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ద్విచక్ర వాహనచోరీల్లో ఉపయోగిస్తూ.. వాటిని తక్కువ ధరకే విక్రయించి సొమ్ముచేసుకుంటున్నాడు. ఎల్బీనగర్‌, చైతన్యపురి, మీర్‌పేట, ఉప్పల్‌ ఠాణాలతోపాటు గద్వాల్‌ జిల్లాలోని ఉండవల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 9 బైక్‌లు చోరీచేశాడు. ఈ నెల 18న ఓ వైద్యుడు తన ద్విచక్ర వాహనాన్ని కామినేని ఆస్పత్రి ఎదుట పార్కుచేయగా... హుస్సేన్‌రెడ్డి చోరీచేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితున్ని అరెస్టుచేశారు. బైక్‌లనూ స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌వోటీ డీసీపీ మురళీధర్‌, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు అంజిరెడ్డి, సుధాకర్‌, డీఐ ఉపేందర్‌రావు, ఎస్సై నరేందర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని