logo

మురుగు పరుగులకు రోబో సివర్‌క్రాక్‌ అడ్డుకట్ట

డ్రైనేజీ మ్యాన్‌హోల్‌ పూడికతీతకు దిగి కార్మికులు అస్వస్థతకు గురవ్వడం.. మృత్యువాతపడడం లాంటి ప్రమాదాలకు ఇకపై చెక్‌ పడనుంది.

Published : 30 Jan 2023 03:34 IST

సనత్‌నగర్‌ డివిజన్‌లో ప్రయోగం విజయవంతం

సివర్‌క్రాక్‌ యంత్రం

ఈనాడు, హైదరాబాద్‌: డ్రైనేజీ మ్యాన్‌హోల్‌ పూడికతీతకు దిగి కార్మికులు అస్వస్థతకు గురవ్వడం.. మృత్యువాతపడడం లాంటి ప్రమాదాలకు ఇకపై చెక్‌ పడనుంది. గ్రేటర్‌ వ్యాప్తంగా మురుగు నీటి గొట్టాల శుభ్రతకు సివర్‌క్రాక్‌ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి.

రూ.1.5 కోట్లతో మరో 35 యూనిట్లకు ఆర్డర్లు

గత మూడేళ్లుగా ప్రయోగాత్మక పరిశీలన కింద సనత్‌నగర్‌ డివిజన్‌లో ఈ యంత్రంతో గొట్టాలను శుభ్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ విజయవంతంగా కావడంతో మరో 35 యూనిట్లకు ఆర్డర్‌ ఇవ్వాలని జలమండలి యోచిస్తోంది. ఇందుకు రూ.1.5 కోట్లు వరకు నిధులు వెచ్చించనుంది. మురుగు శుభ్రత కోసం ఇప్పటికే మినీ జట్టి యంత్రాలు వినియోగిస్తున్నారు. అవగాహన లేక కార్మికులు మ్యాన్‌హోళ్లలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అడపాదడపా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా కార్మికులతో పనిలేకుండా మురుగు గొట్టాలను శుభ్రం చేసేందుకు ఈ యంత్రాన్ని వినియోగిస్తున్నారు. ఇక నుంచి గ్రేటర్‌ వ్యాప్తంగా అన్ని జోన్లలో ఈ సాంకేతిక ప్రవేశపెట్టనున్నారు. మ్యాన్‌హోళ్ల లోపలకు వెళ్లి రోబో టెక్నాలజీతో వాటిని శుభ్రం చేయనున్నారు. తొలుత హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌కు చెందిన విశ్రాంత ఇంజనీర్‌ ఈ రోబోకు రూపకల్పన చేశారు. ఇందుకు ఒక్కో బృందంలో ఆరుమంది వంతున ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీరి ఆధ్వర్యంలోనే ఈ యంత్రం పనిచేయనుంది.


ఎలా పనిచేస్తాయంటే..

* మినీ రోబోల మాదిరిగా ఈ యంత్రాలు పనిచేస్తాయి. మ్యాన్‌హోల్‌ నుంచి 30 మీటర్ల దూరం వరకు పోతాయి. అవసరమైతే మరింత లోపలకు పంపే వీలుంది. అక్కడ అడ్డుపడిన వ్యర్థాలను గుర్తించి దానికి ఉన్న పదునైన బ్లేడులతో క్షణాల్లో ధ్వంసం చేస్తుంది. 150ఎంఎం, 200 ఎంఎం, 300 ఎంఎం డయా గొట్టాలకు సరిపడా సివర్‌క్రాక్‌ యంత్రాలు సిద్ధం చేయనున్నారు.

* తరచూ మ్యాన్‌హోళ్లు పొంగే ప్రాంతాలను గుర్తించి రోబో టెక్నాలజీతో నడిచే సివర్‌క్రాక్‌ యంత్రాతో శుభ్రం చేయనున్నారు. దీనికి కెమెరా కూడా ఉంటుంది. బయట నుంచి మానిటర్‌ లో యంత్రం పనితీరును పరిశీలిస్తారు.

* మురుగు గొట్టాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, రాళ్లు, లోహ వ్యర్థాలుంటే కెమెరా చిత్రాలు తీసి...కంప్యూటర్‌కు పంపిస్తుంది. ఇందులో ఉన్న స్టెయిన్‌లెస్‌ కట్టర్లు లోహ వ్యర్థాలను ధ్వంసం చేస్తాయి. రాళ్లు, రసాయన వ్యర్థాలనూ తొలగిస్తాయి. అడ్డు ఉన్నవాటిని చిన్న ముక్కలుగా మార్చి బయటకు పంపించేస్తుంది.

* ఇప్పటికే ఖైరతాబాద్‌, అబిడ్స్‌, సికింద్రాబాద్‌, మలక్‌పేట, అమీర్‌పేట, బేగంపేట, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో మురుగు గొట్టాల్లో బ్లాకేజీలను సివర్‌క్రాక్‌తో శుభ్రం చేశారు. విజయవంతం కావడంతో అన్ని డివిజన్లలో రంగంలోకి దించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని