TS High Court: గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. బడ్జెట్‌ను గవర్నర్‌ ఆమోదించకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. ఈ సందర్భంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Updated : 30 Jan 2023 14:48 IST

హైదరాబాద్: ఈ ఏడాది బడ్జెట్‌ను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ తమిళిసై ఇంకా ఆమోదం తెలపకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ జరిపేందుకు సీజే ధర్మాసనం అంగీకరించింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘‘ఈ విషయంలో గవర్నర్‌కు కోర్టు నోటీసు ఇవ్వగలదా?ఆలోచించుకోండి. గవర్నర్‌ విధుల్లో కోర్టులు న్యాయసమీక్ష చేయొచ్చా? కోర్టులు మితిమీరి జోక్యం చేసుకుంటున్నాయని మీరే అంటారు కదా?’’ అని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ)ను ఉద్దేశించి ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌పై జరిగే విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తారని ఏజీ తెలిపారు. 

2023-24 బడ్జెట్‌ను అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. దానికి గవర్నర్‌ తమిళిసై ఇంకా ఆమోదం తెలపకపోవడంతో అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. గవర్నర్‌ సమ్మతి తర్వాతే బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదిస్తుంది. అనంతరం శాసనసభ, మండలిలో ప్రవేశపెడతారు. ముసాయిదా బడ్జెట్‌ ప్రతులను మూడురోజుల క్రితమే ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయానికి పంపించింది. ఇప్పటివరకు గవర్నర్‌ ఆమోదించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని