logo

సమయం అనుకూలం... వేగం అత్యవసరం

పట్టణంతోపాటు శివారు గ్రామాల మీదుగా వాహనాల రద్దీని తగ్గించేందుకు, తద్వారా రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు తొలిసారిగా తాండూరుకు బాహ్య వలయ రహదారిని సర్కారు మంజూరు చేసింది.

Published : 31 Jan 2023 01:05 IST

అసంపూర్తి బాహ్య వలయంతో అవస్థలు

చెంగోల్‌ వద్ద మట్టికే పరిమితమైన పనులు

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ: పట్టణంతోపాటు శివారు గ్రామాల మీదుగా వాహనాల రద్దీని తగ్గించేందుకు, తద్వారా రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు తొలిసారిగా తాండూరుకు బాహ్య వలయ రహదారిని సర్కారు మంజూరు చేసింది. నిధులు మంజూరై ఐదు సంవత్సరాలు దాటింది. తుది దశకు చేరిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. వేగం పెంచి వేసవిలోగా పూర్తి చేస్తే అందుబాట్లోకి వస్తుంది. వేలాది మంది వాహనదారులకు సౌకర్యంగా మారుతుంది. ట్రాఫిక్‌ రద్దీ తీరనుండటంతో ప్రమాదాలకు అడ్డుకట్టపడేందుకు దోహదపడనుంది.


రోజుకు 5 వేల వాహనాలు..

జిల్లాలో వ్యాపార, వాణిజ్య కేంద్రమైన తాండూరుకు ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు 5 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. వాహనాల సంఖ్యకు అనుగుణంగా రహదారుల విస్తీర్ణం పెంచడం లేదు. వాహనదారులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల రహదారిని పరిశీలించిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.  
ః ప్రమాదాలను అరికట్టేందుకు తాండూరు, యాలాల మండలాలతోపాటు పట్టణం మీదుగా బాహ్య వలయ రహదారి నిర్మాణం చేపట్టారు. మూడు సంవత్సరాలు గడిచినా పనులు పూర్తి కాలేదు. గౌతాపూర్‌, చెంగోల్‌ శివారులో కిలో మీటరున్నర దూరంలో ఎర్రమట్టి మొరం పనులు నిర్వహించారు. కంకర మార్గంలో తారు పనులు చేపట్టాల్సి ఉండగా ఏడాది నుంచి పెండింగ్‌లో ఉంచారు.  


కొన్ని ఉదాహరణలు..

* నవంబరులో గౌతాపూర్‌ సమీపం రిలయన్స్‌ పెట్రో బంకు వద్ద ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొని కొడంగల్‌ మండలం ఉడిమేశ్వరానికి చెందిన నాపరాయి కార్మికుడు దుర్మరణం చెందగా భార్య దివ్యాంగురాలైంది. * డిసెంబరులో గౌతాపూర్‌ చౌరస్తాలో రోడ్డు దాటుతున్న తలారీ రాములును వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో రాములు కాళ్లు విరిగి దివ్యాంగుడై మంచానికి పరిమితమయ్యాడు. * జనవరిలో గౌతాపూర్‌లో లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టగా సిరిగిరిపేటకు చెందిన బాలప్ప మృతి చెందాడు.


రెండు నెలల్లో పూర్తి చేయిస్తాం

- శ్రీనివాస్‌, డీఈ, రహదారులు భవనాల శాఖ, తాండూరు

బాహ్యవలయ రహదారి పనులు చేపట్టిన గుత్తేదారు ప్రస్తుతం జిన్‌గుర్తి - అడ్కిచర్ల రహదారి పనులు నిర్వహిస్తున్నారు. త్వరలో బాహ్యవలయ రహదారి పనుల వద్దకు రప్పించి తారు పనులు పూర్తి చేయిస్తాం. మార్చిలోగా కొలిక్కి తెస్తాం. ఎట్టిపరిస్థితుల్లో జాప్యం జరగకుండా పర్యవేక్షిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు