logo

తాండూరు కందిపప్పు.. అందుకో గుర్తింపు

దేశంలో పేరుగాంచిన తాండూరు కందిపప్పునకు గడచిన డిసెంబరులో భౌగోళిక గుర్తింపు లభించింది.

Published : 31 Jan 2023 01:05 IST

నేడు ధ్రువపత్రం ప్రదానం  

న్యూస్‌టుడే, తాండూరు: దేశంలో పేరుగాంచిన తాండూరు కందిపప్పునకు గడచిన డిసెంబరులో భౌగోళిక గుర్తింపు లభించింది. ఇందుకు సంబంధించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ధ్రువపత్రాన్ని (సర్టిఫికెట్‌)ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డితో పాటు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం సంచాలకులు డాక్టర్‌ జగదీశ్వర్‌ మంగళవారం ప్రదానం చేయనున్నారు. యాలాల రైతు ఉత్పత్తి దారుల సహకార సంఘం ప్రతినిధులతో పాటు, తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అందుకోనున్నారు. ఈ మేరకు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు భారీ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్‌ నిఖిల, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో పాటు సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలు హాజరు కానున్నారని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సుధారాణి తెలిపారు.


హాజరు కానున్న 1500 మంది రైతులు

ఈ సభకు 1500 మంది రైతులు హాజరు కానున్నారు. తాండూరు, బషీరాబాద్‌, యాలాల, పెద్దేముల్‌ మండలాలకు చెందిన రైతులను సభకు ఆహ్వానిస్తున్నారు. ఈమేరకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సభ మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతుంది. మంత్రులు కంది రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శాస్త్రవేత్తలు కంది దిగుబడులు సాధించేందుకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇస్తారు. గుర్తింపు నేపథ్యంలో కంది దిగుబడులకు పెరిగే డిమాండు గురించి వివరిస్తారు.


1.48 లక్షల ఎకరాల్లో సాగుకు అనుకూలం

జిల్లాలోని తాండూరు, యాలాల, పెద్దేముల్‌, బషీరాబాద్‌ మండలాల్లో 1.48 లక్షల ఎకరాల భూములు కంది సాగుకు అనుకూలంగా ఉన్నాయి. తాండూరులోని సున్నపు రాయి నిక్షేపాల లవణాలకు తోడు ఇతర లవణాలు కంది సాగుకు అనుకూలం. ఈ భూముల్లో రైతులు ప్రస్తుతం సగం భూముల్లో మాత్రమే పంటలను సాగు చేస్తున్నారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని