logo

మలివయసుకు భరోసా..

నవమాసాలు మోసి కనిపెంచిన అమ్మ బరువవుతుంటే, ఎత్తుకొని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి భవిష్యత్తుకు బాటలు వేసిన తండ్రి సమాజంలో భారంగా మారుతున్నారు.

Published : 31 Jan 2023 01:05 IST

నిరాదరణకు గురైతే చట్టం అండ

న్యూస్‌టుడే, వికారాబాద్‌, తాండూరు: నవమాసాలు మోసి కనిపెంచిన అమ్మ బరువవుతుంటే, ఎత్తుకొని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి భవిష్యత్తుకు బాటలు వేసిన తండ్రి సమాజంలో భారంగా మారుతున్నారు. జిల్లాలో నిరాదరణకు గురవుతున్న వృద్ధుల సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతుండటం తీవ్రతను తెలియజేస్తోంది. వికారాబాద్‌ జిల్లా కేంద్రం శివారులో ఉన్న ఓ అనాథ ఆశ్రయంలో 34 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతుండటం గమనార్హం. నిరాదరణకు గురైతే చట్టం అడగా నిలుస్తోంది.

చట్టాలు ఇలా.. : కేంద్ర ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం 2007లో చట్టాన్ని రూపొందించింది. సెక్షన్‌ 125 ప్రకారం పిల్లల నుంచి పోషణ కోరే హక్కు తల్లిదండ్రులకు ఉంటుంది.

* తల్లిదండ్రులు, వయోవృద్ధుల రక్షణ, పోషణ చట్టం 2007 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక సంక్షేమ ట్రైబ్యునల్‌ను నియమించి సబ్‌కలెక్టర్‌, ఆర్డీఓ ఛైర్మన్‌గా, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు ఒకరు కన్వీనర్‌గా, స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఒకరిని సభ్యుడిగా నియమించి కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు 2011 నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తూ సేవలందిస్తున్నాయి.


కొన్ని ఉదాహరణలు

* వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వృద్ధురాలికి ఇద్దరు కుమారులు. కోడళ్లతో పాటు కొడుకులు కూడా ఆదరించక పోవడంతో వికారాబాద్‌ పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా, పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించడంతో సమస్య పరిష్కారమైంది.
* తాండూర్‌కు చెందిన ఓ వృద్ధ దంపతులకు ఓ కొడుకు, కూతురు సంతానం. కొడుకు నిరాద]రణకు గురి చేయడంతో కూతురు చేరదీసింది. తల్లిదండ్రుల పేరిట ఉన్న ఐదెకరాల పొలంలో సగం వాటా కావాలని తల్లిదండ్రుల ప్రమేయంతో కూతురు కేసు వేసింది. కేసు న్యాయస్థానంలో కొనసాగుతోంది.
* ధారూర్‌ మండలానికి చెందిన ఓ వృద్ధుడి భార్య మృతి చెందడంతో వికారాబాద్‌లో చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న కుమారుడి దగ్గరికి వచ్చాడు. కొన్ని రోజులకు వృద్ధుడిని ఇంటి నుంచి గెంటి వేయడంతో గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించారు. కుమారుడికి అవగాహన కల్పించడంతో తండ్రిని ఆదరిస్తున్నారు.


ఫిర్యాదు చేస్తే చర్యలు..: శ్రీను, సీఐ, వికారాబాద్‌

వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. సంబంధిత వ్యక్తులను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించి వృద్ధుల బాగోగులు చూసుకునేలా అవగాహన కల్పిస్తాం. వికారాబాద్‌ పోలీస్‌ఠాణా పరిధిలో ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరిపై కేసులు నమోదు చేశాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని