logo

ఏదీ సమరయోధుల ప్రస్తావన?

భారత స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన మహనీయులకు సంబంధించిన చిత్రాలు గానీ వారి ప్రస్తావన గానీ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చలేదని ప్రముఖ పాత్రికేయులు, రచయిత పి.సాయినాథ్‌ వ్యాఖ్యానించారు.

Published : 31 Jan 2023 04:10 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వెబ్‌సైట్‌ నిర్వహణపై రచయిత పి.సాయినాథ్‌ విమర్శ

సదస్సులో ప్రసంగిస్తున్న పి.సాయినాథ్‌. వేదికపై  ప్రతాప్‌, కిరణ్‌, గాయకుడు రామ్‌ మిర్యాల

మాదాపూర్‌, న్యూస్‌టుడే: భారత స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన మహనీయులకు సంబంధించిన చిత్రాలు గానీ వారి ప్రస్తావన గానీ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చలేదని ప్రముఖ పాత్రికేయులు, రచయిత పి.సాయినాథ్‌ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర పోరాటం కేవలం ఉత్తర భారత్‌లోని బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోనే జరగలేదని, దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ పోరాటంలో భాగస్వాములయ్యారన్నారు. సోమవారం స్వేచ్ఛా తెలంగాణ సంస్థ, ఫోరం ఫర్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌ ఆధ్వర్యంలో‘‘ ఫూట్‌ సోల్జర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫ్రీడం’’ అంశంపై మాదాపూర్‌లోని ఫినిక్స్‌ ఏరినా పార్క్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ వెబ్‌సైట్‌లో స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను ప్రస్తావించకపోవడం శోచనీయం. దక్షిణ భారతదేశంలో అల్లూరి సీతారామరాజు, మల్లుస్వరాజ్యం, ఎన్‌.శంకరయ్య, నల్లకణ్ణు లాంటి ఎంతోమంది సమరయోధులు ఉన్నారు. అందులో 15 మంది పోరాట యోధుల విశేషాలను నేను రచించిన ఫూట్‌ సోల్జర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫ్రీడం పుస్తకంలో ప్రస్తావించా.. ఇందులో ఆదివాసులు, దళితులు, రైతులు, మహిళలు ఉన్నారు. 1972-1980 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వాలు తీసుకువచ్చిన 7 చట్టాల కారణంగా ఎంతోమంది దళిత, గిరిజన దిగువ తరగతులకు చెందిన స్వతంత్ర సమరయోధులను అధికారికంగా గుర్తించకుండా తిరస్కరించారు. 1880-1920 మధ్య బ్రిటిష్‌ అరాచక పాలనలో 165 మిలిమన్ల మంది భారతీయుల చనిపోయారు. ఇంతటి నరమేధానికి పాల్పడిన బ్రిటిష్‌ రాజ్యానికి సంబంధించిన ఎలిజబెత్‌ రాణి మరణిస్తే ఆమె గౌరవ సూచికంగా మన జాతీయ జెండాను అవనతం చేయడం సిగ్గుచేటు’’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు గాయకులు రామ్‌ మిర్యాల తన గీతాలతో అందరినీ ఆలోచింపజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని