logo

చదువులకు స్వదేశానికొచ్చి.. రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృత్యువాత

ఆ జంట..22 ఏళ్ల కిందట ఉద్యోగం కోసం న్యూజిలాండ్‌ వెళ్లారు. కుమార్తె, కుమారుడు అక్కడే జన్మించడంతో ఆ దేశ పౌరసత్వం లభించింది.

Published : 31 Jan 2023 06:58 IST

సాయిశ్రీశాంత్‌రెడ్డి

బండ్లగూడ, (హైదరాబాద్‌) న్యూస్‌టుడే: vస్వదేశంలోనే పిల్లలను చదివించాలనేది ఆ తల్లిదండ్రుల ఆకాంక్ష. దీంతో ఐదేళ్ల కిందట నగరానికి వచ్చారు. ఈ క్రమంలో 8వ తరగతి చదువుతున్న కుమారుడు సైకిల్‌పై వెళ్తుండగా బైక్‌ ఢీకొని మృత్యువాత పడటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నాగోల్‌ డివిజన్‌ బండ్లగూడ సమీపంలోని శ్రీఇంద్రప్రస్థకాలనీలో జరిగిన ఈ సంఘటన వివరాలుకుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... జగిత్యాల జిల్లా మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన ముదిగంటి సురేందర్‌రెడ్డి, స్వర్ణలక్ష్మిలది ప్రేమ వివాహం. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైన వీరు న్యూజిల్యాండ్‌లో స్థిరపడ్డారు. అక్కడే వారికి శ్రీజ, సాయిశ్రీశాంత్‌రెడ్డి (13) జన్మించారు. తొలుత అక్కడే స్కూలులో చేర్పించినా.. తర్వాత నగరానికి వచ్చి ఇంద్రప్రస్థకాలనీలో ఉంటున్నారు.  కుమారుడు సాగర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని అక్షర స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం శ్రీశాంత్‌రెడ్డి, ఇద్దరు స్నేహితులు కలిసి సైకిళ్లపై ఇందు అరణ్య ఎదురుగా కొత్త రోడ్డు వైపు వెళ్లారు. అతి వేగంగా బైక్‌పై వచ్చిన యువకులు శ్రీశాంత్‌రెడ్డి సైకిల్‌ను ఢీకొట్టారు. దీంతో బాలుడి తలకు తీవ్రగాయమైంది.  హుటాహుటిన అతన్ని కామినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ప్రకటించారు.

అక్కడ వరదలతో...: తల్లి స్వర్ణలక్ష్మి మూడు నెలల కిందటే న్యూజిలాండ్‌ వెళ్లారు. కుమారుడి విషయం తెలిసి వెంటనే వచ్చేందుకు ప్రయత్నించినా... అక్కడ వరదల కారణంగా విమానాశ్రయాలు మూసి వేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రికి చేరుకునే అవకాశం ఉందన్నారు.

మద్యం మత్తులో మైనర్లు:  ఈ ఘటనలో సాయినగర్‌కు చెందిన ఇద్దరు మైనర్లు బైకుపై వేగంగా వస్తుండగా... వీరి రైడింగ్‌ను మరో యువకుడు చిత్రీకరిస్తున్నాడు. సైకిల్‌ను ఢీకొట్టి వీరూ కిందపడటంతో వాకింగ్‌ చేస్తున్న వారు పట్టుకున్నారు. మద్యం తాగి ఉన్నారని మృతుడి కుటుంబ సభ్యులు, ప్రత్యక్షసాక్షులు ఆరోపించారు. హయత్‌నగర్‌ పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని