logo

Hyderabad: ఉరేసుకుంటున్నట్లు భర్తకు ఫొటో పంపి ఆత్మహత్య

చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భర్తకు ఫొటో పంపిన భార్య బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఇది.

Published : 31 Jan 2023 08:51 IST

పూజ పరియార్‌

జూబ్లీహిల్స్‌: చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భర్తకు ఫొటో పంపిన భార్య బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఇది. జూబ్లీహిల్స్‌ పోలీసుల వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన రాజన్‌ పరియార్‌ అలియాస్‌ రాజేష్‌ ఏడాదిన్నర క్రితం అదే ప్రాంతానికి చెందిన పూజ పరియార్‌(19)ను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన రెండు నెలల తరువాత ఇద్దరూ నగరానికి వచ్చారు. జూబ్లీహిల్స్‌లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసించే శైలుబాబు అనే వ్యాపారి వద్ద పనికి చేరి అక్కడే క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. పూజ టిక్‌టాక్‌ చేస్తుండడంపై భర్త మందలించేవాడు. భర్త మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని పూజ సైతం గొడవ పడేది.

ఆదివారం  సాయంత్రం బాత్‌రూంలో చున్నీతో ఉరి వేసుకున్నట్లు ఒక ఫొటో రాజేష్‌కు పంపింది. బయట పనిలో ఉన్న భర్త 6.30 గంటల ప్రాంతంలో ఫొటో చూసి ఇంటికొచ్చి తలుపు తట్టగా ఎంతకూ తీయలేదు. గట్టిగా నెట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఫ్యానుకు చున్నీతో ఉరేసుకొని అచేతనంగా కనిపించింది. 108 సిబ్బంది వచ్చి ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకొని ఇద్దరి చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. అయితే,  ఫొటోలో ఉన్న చున్నీ, గదిలో ఉరేసుకున్న చున్నీ వేర్వేరని పోలీసులు గుర్తించారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని