logo

నకిలీ పత్రాలు సృష్టించి.. నిందితులకు జామీన్లు

వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి న్యాయస్థానంలో జామీను వచ్చేందుకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్న ఘటన మెదక్‌ జిల్లాలో వెలుగు చూసింది.

Published : 31 Jan 2023 04:10 IST

ఈనాడు, మెదక్‌, న్యూస్‌టుడే, శివ్వంపేట: వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి న్యాయస్థానంలో జామీను వచ్చేందుకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్న ఘటన మెదక్‌ జిల్లాలో వెలుగు చూసింది. శివ్వంపేట మండలం కేంద్రంలోని చెన్నాపూర్‌కు చెందిన ఒకరు ఈ దందా సాగిస్తున్నట్లు బహిర్గతమైంది. తమకు తెలిసిన నిందితులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారికి జామీను ఇచ్చేందుకు, పంచాయతీకి చెందివారుగా నకిలీ పత్రాలు సృష్టించారు. కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ స్టాంపులనూ వినియోగించారు. కొన్ని రోజుల కిందట చెన్నాపూర్‌కి చెందిన నర్సింహులు, ఈ ఊరి పక్కనే టిక్యాదేవమ్మతండాకు చెందిన విఠల్‌లను పోలీసులు ఒక కేసు విషయంలో కూకట్‌పల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారిద్దరూ చెన్నాపూర్‌ పేరిట ఉన్న పత్రాలను జామీను కోసం అందించారు. టిక్యాదేవమ్మతండా కూడా పంచాయతీ కావడంతో న్యాయమూర్తికి అనుమానం వచ్చింది. విఠల్‌కు చెన్నాపూర్‌ పంచాయతీ నుంచి ధ్రువపత్రాలు ఎలా ఇచ్చారో విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో జనవరి 20న కోర్టు సిబ్బంది చెన్నాపూర్‌ వచ్చారు. వారి వద్ద ఉన్న పత్రాలను స్థానిక సర్పంచి భారతికి చూపించారు. దీంతో అవన్నీ సృష్టించినవేనని తేలింది. గత అయిదునెలలుగా చెన్నాపూర్‌లో పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీగానే ఉంది.  శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌లో ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు రెండుసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని సర్పంచి ఆరోపించారు.


చెన్నాపూర్‌ కేంద్రంగా.. వందల సంఖ్యలో!

నిందితులకు జామీన్లు ఇచ్చేందుకు వారు చెన్నాపూర్‌లో ఉంటున్నారనేందుకు అవసరమైన ధ్రువపత్రాలను కొందరు సృష్టిస్తున్నారు. దాదాపు 200కు పైగా ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల నకిలీపత్రాలు పొందిన నర్సింహులు, విఠల్‌ను అడగ్గా.. గ్రామానికి చెందిన సతీష్‌ ఇచ్చారని వారు అంగీకరించారని సర్పంచి  వివరించారు. సతీష్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులూ దీనిపై దృష్టిసారించనట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని