logo

రుణం ఇస్తామంటూ టోకరా

రుణం ఇస్తామంటూ ప్రముఖ సంస్థల పేరుతో మాట్లాడి రూ.లక్షల్లో మోసాలు చేస్తున్న ముఠాను సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 31 Jan 2023 04:10 IST

9 కేసుల్లో నిందితుల అరెస్టు

ఈనాడు, హైదరాబాద్‌: రుణం ఇస్తామంటూ ప్రముఖ సంస్థల పేరుతో మాట్లాడి రూ.లక్షల్లో మోసాలు చేస్తున్న ముఠాను సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌కార్డుల ద్వారా మాట్లాడుతూ.. ఇతరుల బ్యాంకు ఖాతాలతో లావాదేవీలు నిర్వహిస్తూ పకడ్బందీగా ఈ నకిలీ దందా నడిపిస్తున్నారు. రుణం కోసం ఎవరైనా సంప్రదిస్తే మాట్లాడేందుకు ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ కూడా ఏర్పాటు చేశారు. సైబరాబాద్‌లో 9 కేసుల్లో నిందితులైన ముగ్గుర్ని అరెస్టు చేశారు. 17 డెబిట్‌కార్డులు, 4 ఫోన్లు, నకిలీ రుణ వితరణ లేఖలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ కల్మేశ్వర్‌ శింగెనవార్‌, సైబర్‌క్రైమ్స్‌ డీసీపీ రితిరాజ్‌, సైబర్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ శ్యామ్‌బాబు సోమవారం వెల్లడించారు. బిహార్‌లోని నలందా, పట్నా తదితర ప్రాంతాలకు చెందిన సుభాష్‌కుమార్‌, శ్రీకాంత్‌కుమార్‌, అమిత్‌కుమార్‌ నకిలీ కాల్‌సెంటర్లలో టెలీకాలర్లుగా పనిచేశారు. అంతా ఒక ముఠాగా ఏర్పడి రుణ మోసాలు చేస్తున్నారు.  ప్రముఖ రుణ సంస్థల పేరిట ఆన్‌లైన్‌, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చి.. తమ ఫోన్‌ నెంబరు ఉంచుతారు. లింకు లేదా ప్రకటన క్లిక్‌ చేయగానే కాల్‌సెంటర్‌ నుంచి మాట్లాడుతున్నామంటూ  నిబంధనలు చెబుతారు. రుణం ఇచ్చేందుకు ఒప్పందం రుసుం, జీఎస్టీ అంటూ వసూలు చేస్తారు. ఇలా వచ్చిన డబ్బును గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదల ఖాతాల్లో జమ చేస్తారు. ఆ తర్వాత వాటిని బదిలీ చేసుకుంటారు. నిందితులు తమ మోసాల కోసం 725 ప్రీయాక్టివేటెడ్‌ సిమ్‌కార్డులు, 675 ఇతరుల బ్యాంకు ఖాతాల్ని వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని