logo

కుష్ఠు వ్యాధి సంపూర్ణ నివారణ సాధ్యమే

కుష్ఠు వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తుందని, అయితే వంద శాతం నివారించవచ్చని తెలంగాణ ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డెర్మటాలజిస్ట్స్‌ అండ్‌ లెప్రాలజిస్ట్స్‌(ఐఏడీవీఎల్‌) అధ్యక్షుడు డాక్టర్‌ అనూప్‌ లహరి అన్నారు.

Published : 31 Jan 2023 04:10 IST

ఐఏఎల్‌, ఐఏడీవీఎల్‌ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

కేబీఆర్‌ పార్కు చెంత బ్యానర్‌, ప్లకార్డులతో ర్యాలీలో ప్రతినిధులు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: కుష్ఠు వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తుందని, అయితే వంద శాతం నివారించవచ్చని తెలంగాణ ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డెర్మటాలజిస్ట్స్‌ అండ్‌ లెప్రాలజిస్ట్స్‌(ఐఏడీవీఎల్‌) అధ్యక్షుడు డాక్టర్‌ అనూప్‌ లహరి అన్నారు. ఏటా దేశంలో లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని, కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కుష్ఠు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ ఉద్యానం నుంచి జూబ్లీహిల్స్‌లోని తాజ్‌ మహల్‌ హోటల్‌ వరకు అవగాహన ర్యాలీ, అనంతరం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ నేపథ్యంలో సరైన అధ్యయనం లేక ఇటీవల కుష్ఠు బాధితుల సంఖ్య పెరిగిందన్నారు. ఎలాంటి స్పర్శ లేని తెలుపు మచ్చలు శరీరం మీద కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక కేంద్రాలు, యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, ఉచిత చికిత్స పొందవచ్చని పేర్కొన్నారు. ఐఏడీవీఎల్‌ ప్రధాన కార్యదర్శి డా ఇందిర మాట్లాడుతూ.. సరైన చికిత్స తీసుకోకపోతే నరాలు బలహీనంగా మారి అంగవైకల్యానికి దారి తీస్తుందన్నారు. వ్యాధిపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకు కృషి చేస్తున్నామని ఐఏఎల్‌, ఐఎల్‌ఏ అధ్యక్షులు డాక్టర్‌ పి.నరసింహరావు తెలిపారు. ఐఏఎల్‌ కార్యదర్శి డా.సుజయ్‌ సునీత, కార్యనిర్వాహక సభ్యులు  పార్థసారధి, భూమేష్‌ కుమార్‌, రాజ్యలక్ష్మి, డీవీఎల్‌ విభాగాధిపతి, గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.నరసింహరావు, ఉస్మానియా హెచ్‌ఓడీ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని