logo

డ్రోన్‌తో సాగుతూ..ఆదాయం సముపార్జిస్తూ..

వ్యవసాయంలో వినియోగించే డ్రోన్లు.. ట్రాక్టర్ల తరహాలో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.

Published : 31 Jan 2023 04:10 IST

ఐదు రోజుల్లో శిక్షణ పూర్తి
పదేళ్ల గడువుతో లైసెన్సు..

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయంలో వినియోగించే డ్రోన్లు.. ట్రాక్టర్ల తరహాలో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. వాటిని సొంతంగా కొనుగోలు చేసినవారు.. ఇతరులకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఏడాదిలోనే పెట్టుబడి తిరిగి పొందడం సహా ఆదాయాన్నీ ఆర్జిస్తున్నారు. డ్రోన్ల కొనుగోలుకు ప్రస్తుతం బ్యాంకులు రుణాలిస్తుండటంతో రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. నగరానికి చెందిన డ్రోన్‌ స్టార్టప్‌ కంపెనీలనుంచి ఇతర రాష్ట్రాలకు డ్రోన్లు వెళ్తుండటంతో, వాటి పనితీరు, ఆదాయ ఆర్జనపై రైతులనుంచి అభిప్రాయాలు సేకరించగా సత్ఫలితాలనిస్తున్నాయని సంబంధిత కంపెనీల ప్రతినిధులు తెలిపారు. డ్రోన్‌ కొనుగోలు చేసినవారికి నగరంలోని బేగంపేటలో శిక్షణ ఇస్తుండటం, పదేళ్ల గడువుతో లైసెన్సు కూడా మంజూరు చేస్తుండటంతో కొనుగోళ్లకు కర్షకులు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 150కి పైగా డ్రోన్లు, ఇతర రాష్ట్రాల్లో 170కి పైగా డ్రోన్లను రైతులు ఉపయోగిస్తున్నారు. వాటిని ఫర్టిలైజర్‌ పిచికారీకి ఎక్కువగా వినియోగిస్తున్నారు.


రుణాలిస్తున్న బ్యాంకులు..

డ్రోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారు బ్యాంకుకు వెళ్తే..కేవైసీ, సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా సర్టిఫైడ్‌ డ్రోన్‌ కొనుగోలుకు రుణాలు ఇస్తున్నాయి. ఇందుకు రూ.10 లక్షలు(డ్రోన్‌,బ్యాటరీ) ఖర్చవుతుంది. తెలంగాణతోపాటు పాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర రైతుల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని డ్రోన్‌ స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. పురుగుమందుల పిచికారీకి ఎకరానికి రూ.500 చొప్పున ప్రస్తుతం ఛార్జీ చేస్తుండగా..రోజుకు 20 ఎకరాలు చొప్పున 20 రోజుల చొప్పున రైతులు ఆదాయం పొందుతున్నారు. డ్రోన్‌ కొనుగోలు చేసినవారికి ఐదు రోజల పాటు బేగంపేటలో శిక్షణ అందిస్తుండగా.. ఇప్పటివరకు 42 బ్యాచ్‌లకు శిక్షణ పూర్తయిందని టీఎస్‌ఏఏ సంస్థ ప్రతినిధి దినకర్‌ దేవిరెడ్డి పేర్కొన్నారు.


రోజులో 25 నుంచి 30 ఎకరాల్లో పిచికారీ

-ప్రేమ్‌కుమార్‌, మారుత్‌డ్రోన్స్‌ వ్యవస్థాపకుడు

10 లీటర్ల సామర్థ్యం కలిగిన స్ప్రేయింగ్‌ ట్యాంకుతో ఒక ఎకరా భూమిలో 5 నిమిషాల్లో పిచికారీ చేయొచ్చు. పేలోడ్‌నూ మార్చే సదుపాయం ఉండటంతో స్ప్రేయింగ్‌తో పాటు ఫర్టిలైజర్‌, పంట వృద్ధిపై పర్యవేక్షణ, పాలినేషన్‌ను చేసుకోవచ్చు. సెకనుకు 15 మీటర్ల వేగం ఉండటంతో తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తవుతుంది. వీటిని పగలు, రాత్రి ఉపయోగించే సదుపాయం ఉంది. పేలోడ్‌ మారిస్తే మరింత అదనపు ఆదాయం పొందొచ్చు. అన్నదాతలతో పాటు పలు సంస్థల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని