logo

సంక్షిప్త వార్తలు

ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనార్టీ వర్గాల పేదింటి ఆడ పిల్లల వివాహాలకు ‘షాదీ ముబారక్‌’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని..

Updated : 01 Feb 2023 05:49 IST

క్రైస్తవులకు ప్రత్యేక పేరుతో షాదీముబారక్‌: తలసాని

నారాయణగూడ, న్యూస్‌టుడే: ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనార్టీ వర్గాల పేదింటి ఆడ పిల్లల వివాహాలకు ‘షాదీ ముబారక్‌’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని.. క్రైస్తవులకు సంబంధించిన పేరుతో ప్రత్యేకంగా అమలు చేస్తే బాగుంటుందనే ప్రతిపాదనలపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మంగళవారం తెలంగాణ యునైటెడ్‌ క్రిస్టియన్‌ అండ్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌ (టీయూసీపీఏ) ఆధ్వర్యంలో నారాయణగూడలోని బాప్టిస్ట్‌ చర్చిలో రాష్ట్రంలోని 33 జిల్లాల పాస్టర్లతో సదస్సులో ఆయన మాట్లాడుతూ... క్రైస్తవుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన లేదన్నారు. పిల్లలను మైనార్టీ గురుకులాల్లో చేర్పించాలని సూచించారు. నటుడు, పాస్టర్‌ రాజా, సంఘం ప్రధాన కార్యదర్శి సాల్మన్‌రాజ్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


విశ్వకొంకణి సమారోహ్‌కు మెర్సీ మార్గరెట్‌

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: కొంకణి భాషా సాంస్కృతిక సంస్థ, వరల్డ్‌ కొంకణి సెంటర్‌ల నిర్వహణలో జరిగే ‘విశ్వకొంకణి సమారోహ్‌’కు నగరానికి చెందిన తెలుగు కవయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్‌కు ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు కర్ణాటకలోని మంగళూరులో జరిగే బహుభాష సమ్మేళనంలో ఆమె పాల్గొంటారు.


ఆర్టీఏకు వచ్చిన నటుడు శర్వానంద్‌

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: సినీ నటుడు శర్వానంద్‌ మంగళవారం ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయానికి వచ్చారు. తన అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌లకు అవసరమైన ఫొటో దిగి, డిజిటల్‌ సంతకం చేశారు.


గంగా పుష్కరాలకు ప్రత్యేక ప్యాకేజీ

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న రమణ, సంస్థ ప్రతినిధులు

కూకట్‌పల్లి: గంగానది పుష్కరాలకు ప్రత్యేక రాయితీ ప్యాకేజీని తీసుకొచ్చినట్లు ఆర్‌వీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత ఆర్‌.వి.రమణ ప్రకటించారు. మంగళవారం కూకట్‌పల్లిలోని సంస్థ కార్యాలయంలో ఆయన గోడపత్రికను ఆవిష్కరించారు. బ్యాంకాక్‌ టూర్‌ను విమాన, వసతి, భోజనం సౌకర్యాలతో కలిపి ఒక్కొక్కరికి రూ.31,999 ప్రత్యేక డిస్కౌంట్‌ ప్యాకేజీని తీసుకొచ్చామన్నారు. ఈ ఏడాది వేసవిని దృష్టిలో పెట్టుకొని దేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టామన్నారు. అడ్వాన్స్‌ రూ.10 వేలు చెల్లించిన వారికి యాత్ర ప్యాకేజీలో 10 శాతం ప్రత్యేక రాయితీ ఉంటుందన్నారు. గడువును ఈనెల 28 వరకు పొడిగించినట్లు వివరించారు. వివరాలకు 70326 66921


బస్తీకి కావాలి నీరు.. నడి రోడ్డుపై బోరు

అడ్డగుట్ట బస్టాప్‌ నుంచి షెనాయి నర్సింగ్‌హోం వైపు వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో మంగళవారం భారీ పవర్‌బోర్‌ తవ్వారు. సమీప బస్తీవాసుల కోసం చేపట్టిన బోర్‌ వెల్‌ నిర్మాణ పనులను ఉదయం ఉపసభాపతి పద్మారావుగౌడ్‌ ప్రారంభించారు. ట్రాఫిక్‌ పోలీసులు ఇటుగా రాకపోకల నిలిపివేసి మరోవైపు నుంచి మళ్లించారు. ఇక్కడ జలం ఉన్నట్లు భూగర్బ పరీక్షల్లో తేలడంతోనే నడిరోడ్డుపై బోరు వేస్తున్నారని మారేడుపల్లి తహసీల్దార్‌ కార్యాలయం అధికారులు చెబుతున్నారు.

న్యూస్‌టుడే, అడ్డగుట్ట


లింగంపల్లి ఎంఎంటీఎస్‌ స్టేషన్‌- విప్రో మధ్య షీ షటిల్‌

రాయదుర్గం, న్యూస్‌టుడే: మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర పేర్కొన్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆవరణలో మంగళవారం ఆయన షీ షటిల్‌ బస్సు సర్వీస్‌ను జెండా ఊపి ఆరంభించారు. షీ షటిల్స్‌ మహిళలకు పూర్తి భద్రతతో ఉచిత సేవలందిస్తుందని అన్నారు. ఈ సర్వీసు లింగంపల్లి ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌ నుంచి విప్రో వరకు నడుస్తుందని చెప్పారు. ఎస్‌సీఎస్‌సీ (సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌) ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల మాట్లాడుతూ.. డీఎస్‌ఎం సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో బస్సును అందించిందని తెలిపారు. జాయింట్‌ సీపీలు అవినాష్‌ మహంతి, నారాయణ్‌ నాయక్‌, డీఎస్‌ఎం సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ మనోజ్‌ కల్రా, పర్చేసింగ్‌ డైరెక్టర్‌ అమ్లు చల్లగొండ పాల్గొన్నారు.


4, 5 తేదీల్లో నీటి సరఫరాలో అంతరాయం

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా ఫేజ్‌-2 రింగ్‌మెయిన్‌కు సంబంధించి బైరామల్‌గూడ వద్ద జంక్షన్‌ పనులు చేపడుతున్న దృష్ట్యా ఈ నెల 4, 5 తేదీల్లో నగరంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏపీఏ రిజర్వాయర్‌ పరిధిలోని ప్రాంతాలతోపాటు బాలాపూర్‌, మైసారం, బార్కస్‌, మేకల్‌మండి, బోలక్‌పూర్‌, తార్నాక, లాలాపేట్‌, బౌద్ధనగర్‌, మారేడుపల్లి, కంట్రోల్‌రూం, ఎంఈఎస్‌, కంటోన్మెంట్‌, ప్రకాశ్‌నగర్‌, పాటిగడ్డ, హస్మత్‌పేట్‌, ఫిరోజ్‌గూడ, గౌతంనగర్‌, వైశాలినగర్‌, బీఎన్‌రెడ్డినగర్‌, వనస్థలిపురం, ఆటోనగర్‌, అల్కాపురి, మహేంద్రాహిల్స్‌, రామంతాపూర్‌, ఉప్పల్‌, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్‌, బీరప్పగడ్డ, బుద్వేల్‌, శాస్త్రిపురం, బోడుప్పల్‌, మీర్‌పేట్‌, బడంగపేట్‌, శంషాబాద్‌ తదితర రిజర్వాయర్ల ప్రాంతాల్లో సరఫరా ఉండదని వివరించింది.


3 నుంచి 12 వరకు లేపాక్షి ప్రదర్శన

జూబ్లీహిల్స్‌: కేంద్ర, ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌ నందగిరిహిల్స్‌లో లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్‌ ఎంపోరియంలో ఈనెల 3 నుంచి 12 వరకు హస్త కళల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఎంపోరియం మేనేజర్‌ యం.ఢిల్లేశ్వర్‌రావు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. ‘లేపాక్షి థీమాటిక్‌ ఎగ్జిబిషన్‌’ పేరుతో నిర్వహించే ఈ ప్రదర్శనకు తెలుగు రాష్ట్రాలతో పాటు 20 రాష్ట్రాల నుంచి హస్తకళాకారులు వచ్చి ఉత్పత్తులను విక్రయిస్తారన్నారు.కళాకృతుల తయారీ విధానాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూపిస్తారని పేర్కొన్నారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని