logo

మోసానికి ప్రేరణ

‘‘ఎన్నాళ్లీ పేదరికం.. చేతినిండా డబ్బు ఉండాలి. జల్సాగా గడపాలి.. ఈ ఆలోచన వరంగల్‌ యువకుడు శ్రీకాంత్‌ను మోసగాడిగా మార్చింది. డబ్బు సంపాదించేందుకు యూట్యూబ్‌లో అడ్డదారులు వెతికేలా చేసింది.

Updated : 01 Feb 2023 05:43 IST

యూట్యూబ్‌, సినిమాలు చూసి నేరాల బాట

గతేడాది నగర పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ఎన్నాళ్లీ పేదరికం.. చేతినిండా డబ్బు ఉండాలి. జల్సాగా గడపాలి.. ఈ ఆలోచన వరంగల్‌ యువకుడు శ్రీకాంత్‌ను మోసగాడిగా మార్చింది. డబ్బు సంపాదించేందుకు యూట్యూబ్‌లో అడ్డదారులు వెతికేలా చేసింది. ‘లివింగ్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌’ పేరుతో బోగస్‌ కంపెనీ ప్రారంభించాడు. మరో ముగ్గురితో కలసి ముఠా కట్టాడు. ఉద్యోగులను నియమించి వారికి జీతాలు జమచేస్తున్నట్టు బ్యాంకు ఖాతాలు రూపొందించాడు. వారి పేరిట ప్రముఖ బ్యాంకుల నుంచి క్రెడిట్‌కార్డులు తీసుకున్నాడు. 34 క్రెడిట్‌కార్డుల నుంచి రూ.1.34 కోట్లు విత్‌డ్రా చేశాడు’’. హబ్సిగూడ బ్యాంకు మేనేజర్‌ ఫిర్యాదుతో మల్కాజిగిరి ఎస్‌వోటీ, నాచారం పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.
 * మహారాష్ట్ర నుంచి బతుకుదెరువుకు నగరం చేరిన కె.రమేష్‌బాబు బండ్లగూడ జాగీర్‌లో మెకానిక్‌ దుకాణం ప్రారంభించాడు. ఇతడి చెల్లెలు రామేశ్వరి నగరంలోని కళాశాలలో వైద్యవిద్యకోర్సు చదువుతోంది. ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు నకిలీ నోట్ల తయారీ ప్రారంభించారు. యూట్యూబ్‌ వీడియోలతో కొత్త పద్ధతులు తెలుసుకొని రూ.100, 200, 500 నోట్లను స్కాన్‌ చేసి.. అనుమానం రాకుండా సరైన రంగులు అద్దటంలో ప్రావీణ్యం సంపాదించారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్‌, దిల్లీల్లో రూ.1 కోటి వరకూ చలామణీ చేశారు.


విజ్ఞానంతోపాటు నేర పాఠాలు...

సినిమాలు, యూట్యూబ్‌ వేదికలు వినోదం, విజ్ఞానం పంచుతుంటాయి. నాణేనికి మరోవైపు తేలికగా డబ్బు సంపాదన.. ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునే పాఠాలు నేర్పుతున్నాయి. వెండితెరపై కథానాయకుడు డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు, మోసాలు, కిడ్నాప్‌లు, పోలీసు, సీఐడీ అధికారులమంటూ బురిడీ కొట్టించి రూ.కోట్లు కొల్లగొడతారు. పోలీసులకు పట్టుబడకుండానే శుభంకార్డు వేస్తారు. ఇవే తరహాలో నేరాలు చేసి తేలికగా తప్పించుకోవచ్చనే అపోహతో కొందరు బయట అమలు చేస్తున్నారని సైబరాబాద్‌కు చెందిన ఓ పోలీసు అధికారి విశ్లేషించారు. రెండేళ్ల క్రితం గచ్చిబౌలి ప్రాంతంలోని ఒక రియల్‌వ్యాపారి ఇంట్లోకి ఆదాయపన్నుశాఖ అధికారులమంటూ చేరిన ముఠా 1.28 కిలోల బంగారం, రూ.2 లక్షల నగదు కొట్టేసి పారిపోయారు. దీనికి ముందు ముఠా సభ్యులు యూట్యూబ్‌లో హిందీ సినిమా చూశారు. అక్కడ పాత్రలను పోలినట్టుగా టిప్‌టాప్‌గా తయారై నాటకం రక్తికట్టించారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంతో పోలీసులు ముఠాను గుర్తించి అరెస్ట్‌ చేశారు. సినిమా, బుల్లితెర అనేది కేవలం వినోదంగా భావించాలి. తెరపై హీరో చేసినవన్నీ బయట చేయాలని చూసినా.. చేసినా జైలు ఊచలు లెక్కించాల్సి ఉంటుందని నగరానికి చెందిన ఓ డీసీపీ హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు