logo

గల్లీల్లో ముఠాలు.. మత్తులో కొట్లాటలు!

నిత్యం సైరన్ల మోతతో తిరిగే వాహనాలు. గస్తీ విధుల్లో వేలాది మంది పోలీసులు. డయల్‌100కు ఫోన్‌కాల్‌ రాగానే 4-5 నిమిషాల్లో చేరగల సత్తా. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో అనే చందంగా శాంతిభద్రతల పరిస్థితి మారింది.

Updated : 01 Feb 2023 07:01 IST

నగరంలో రాత్రిళ్లు రెచ్చిపోతున్న మందుబాబులు
చూసీచూడనట్టు వదిలేస్తున్న గస్తీ పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే : నిత్యం సైరన్ల మోతతో తిరిగే వాహనాలు. గస్తీ విధుల్లో వేలాది మంది పోలీసులు. డయల్‌100కు ఫోన్‌కాల్‌ రాగానే 4-5 నిమిషాల్లో చేరగల సత్తా. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో అనే చందంగా శాంతిభద్రతల పరిస్థితి మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఏదోమూలన వీధి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. నేరస్థుల చేతుల్లో ఆయుధాలు చూసిన పోలీసులు కొన్నిసార్లు దూరంగా ఉంటున్నారు. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించేందుకు పరిమితమవుతున్నారు. ఇటీవల చాంద్రాయగుట్టలో వాహన పార్కింగ్‌ విషయంలో తలెత్తిన చిన్న గొడవ రెండు గ్రూపులు కొట్టుకునే వరకు వెళ్లింది. తాజాగా ఆసిఫ్‌నగర్‌ సయ్యద్‌అలీగూడ యాదవ బస్తీలో పాతకక్షలు పరిష్కరించుకునేందుకు టీ స్టాల్‌ వద్దకు చేరారు. అక్కడ మాటామాట పెరిగి ఇనుపరాడ్‌లు, తల్వార్లతో నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు. ఘటనలో 10-12 మంది గాయాలపాలయ్యారు. రెండ్రోజుల క్రితం మెహిదీపట్నం వద్ద  ప్రయివేటు కళాశాల విద్యార్థులు రెండు జట్లుగా మారి కోట్లాటకు దిగారు.  

హడావుడి.. చప్పబడి

జనవరి 8న సికింద్రాబాద్‌ ఓల్డ్‌ఘాస్‌మండీ ప్రాంతంలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. తమ కాలనీలో కొత్తవ్యక్తి మద్యం తాగుతుండటాన్ని గమనించి నిలదీశాడు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు తన స్నేహితులను రప్పించి దాడి చేశాడు. గొడవ సద్దుమణిగి వెళ్లిపోతుండగా నిందితుడు గౌస్‌పాషా చిన్నబ్లేడుతో భూక్యా శివాజీ గొంతుపై కోశాడు. 5-6 గంటలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడి మృతి చెందాడు.  ఏదైనా ఇటువంటి ఘటన జరిగినపుడు పోలీసులు హడావుడి చేస్తున్నారు. పెట్రోలింగ్‌ వాహనాల గస్తీ పెంచుతున్నారు. ఇటీవల పాతబస్తీ పరిధిలో రాత్రి విధుల్లో ఉదాసీనంగా వ్యవహరించిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లకు ఉన్నతాధికారులు ఛార్జిమెమోలు జారీ చేసినట్లు సమాచారం.


మత్తు తలకెక్కాక రచ్చ

పాతబస్తీ, శివారు ప్రాంతాల్లో మద్యం దుకాణాల్లో అర్ధరాత్రి దాటాక వెనుక మార్గంలో మందు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ తెల్లవారుజాము వరకూ తెరిచే ఉంటున్నాయి. అప్పటికే కిక్‌ తలకెక్కడంతో బయటకు వచ్చిన యువతీ, యువకులు అక్కడే గొడవ పడుతుంటారు. రాత్రిళ్లు మందుసీసాలతో బయల్దేరిన యువకులు.. ఖాళీగా ఉన్న వీధుల్లో కూర్చొని మద్యం సేవిస్తున్నారు. అక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే దాడికి దిగుతున్నారు. ఆసిఫ్‌నగర్‌, గోల్కొండ, రాయదుర్గం, పంజాగుట్ట, అబిడ్స్‌, మోండామార్కెట్‌, తార్నాక, బోడుప్పల్‌, ఎల్బీనగర్‌, చాంద్రాయణగుట్ట, కర్మన్‌ఘాట్‌, రాజేంద్రనగర్‌ పరిసర ప్రాంతాల్లో అధికశాతం ఆకతాయిలు రాత్రిళ్లు వీధుల్లో మకాం వేసి మద్యం మత్తులో హల్‌చల్‌ చేస్తున్నారని తరచూ డయల్‌ 100కు బాధితుల నుంచి ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని